Producer Dil Raju gave clarity on movie ticket prices
mictv telugu

సినిమా టిక్కెట్ ధరలపై దిల్ రాజు.. ఎక్కడ తప్పు జరిగిందో అర్ధం కావట్లేదు

July 20, 2022

సినిమా టిక్కెట్ ధరలపై నిర్మాతల మండలి చర్చించి తీసుకున్న నిర్ణయాలను ప్రముఖ నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. బుధవారం నాగచైతన్య హీరోగా ఆయన నిర్మించిన ‘థ్యాంక్యూ’ చిత్ర ప్రిరిలీజ్ ఈవెంట్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా టిక్కెట్ ధరలపై స్పష్టత ఇచ్చారు. ‘సినిమా నిర్మాణ వ్యయం పెరుగుదల, పడిపోయిన కలెక్షన్లు, ఓటీటీల ప్రభావం వంటి వాటిపై ఇటీవల మా నిర్మాతలం కూర్చుని చర్చించాం. అందులో సినిమా టిక్కెట్ ధరల అంశం ఒకటి. ఈ విషయంపై నేను ఒకటి చెప్తే మీడియాలో మరొకటి వచ్చింది. ఎక్కడ తప్పు దొర్లిందో తెలియట్లేదు. ప్రభుత్వ జీవో ప్రకారమే మా ‘ఎఫ్ 3’ టిక్కెట్ రేట్లను నిర్ణయించాం. తర్వాత వచ్చిన విక్రమ్, మేజర్ చిత్రాలకు కూడా పాత రేట్లే ఉన్నాయి. ఇప్పుడు వస్తున్న థ్యాంక్యూ సినిమాకు కూడా అవే రేట్లు ఉంటాయి. హైదరాబాద్, వరంగల్ వంటి నగరాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 150 ప్లస్ జీఎస్టీ, మల్టీప్లెక్స్‌లో రూ. 200 ప్లస్ జీఎస్టీ ఉంటుంది. స్టార్ హీరోలు, భారీ బడ్జెట్ చిత్రాలకు మినహా మిగిలిన చిత్రాలకు ఈ రేట్లే ఉంటాయి’ అని వెల్లడించారు. అనంతరం థ్యాంక్యూ చిత్రం గురించి మాట్లాడుతూ ‘మంచి ఫీల్ గుడ్ సినిమా ఇది. అన్ని విభాగాలూ చాలా బాగా పనిచేశాయి. మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాం’ అని వ్యాఖ్యానించారు.