‘కేజీఎఫ్’ సిరీస్ సినిమాలపై బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఈ సినిమాను మేం బాలీవుడ్లో తీసి ఉంటే విమర్శలతో చంపేసేవాళ్ల’ని అభిప్రాయపడ్డారు. ఆయన నిర్మాతగా వ్యవహరించిన బ్రహ్మస్త్ర, జుగ్ జుగ్ జియో, లైగర్ చిత్రాల ప్రమోషన్లో భాగంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సౌత్, నార్త్ సినిమాల గురించి మాట్లాడారు. ‘బాలీవుడ్లో ఈ మధ్య సరైన కంటెంట్‌తో సినిమాలు రావడం లేదు.
ఒకే సినిమాలో అన్ని అంశాలను చూపించాలనుకొని మేం విఫలమయ్యాం. కానీ, సౌత్ డైరెక్టర్స్ మాత్రం తాము అనుకున్నది ప్రేక్షకులకు చూపించాలని అనుకుంటారు. వారికి కథ, కథనంపై నమ్మకం ఎక్కువ. అందుకే వాళ్లు సక్సెస్ అవుతున్నారు. ఇటీవల నేను కేజీఎఫ్ 2 సినిమా చూశా. నాకెంతో నచ్చింది. ఈ సినిమాను మేం బాలీవుడ్లో తీసి ఉంటే ఎన్నో విమర్శలు వచ్చేవి. వాటితో మమ్మల్ని చంపేసేవాళ్లు’ అని సూటిగా మాట్లాడారు. కాగా, పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన కేజీఎఫ్ 2 సినిమా బాక్సాఫీసు వద్ద రూ. 1100 కోట్లను కొల్లగొట్టింది.