ఈ మధ్య సౌత్, నార్త్ సినిమాలు అంటూ డివైడ్ చేసి మాట్లాడడం మామూలైపోయింది. సౌత్ సినిమాలు పాన్ ఇండియా రేంజులో హిట్ అవ్వడం, బాలీవుడ్ సినిమాలు కనీసం పెట్టుబడి కూడా రాబట్టకపోవడంతో ఈ అభిప్రాయం మరింత ఎక్కువైంది. ఈ అంశంపై చాలా మంది నటీనటులు తమతమ అభిప్రాయాలను మీడియా వేదికగా వెల్లడించారు. తాజాగా ఈ విషయంపై ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, అలియా భట్ బాబాయ్ ముఖేష్ భట్ మాట్లాడారు.
‘కరోనా తర్వాత ప్రేక్షకుడి అభిరుచుల్లో మార్పు వచ్చింది. ఇప్పుడు ఓటీటీ కంటెంట్‌ను ఇష్టపడుతున్నారు. తరాలు మారుతున్న కొద్దీ ఇండస్ట్రీ కూడా మారాలి. లేకపోతే మనుగడ సాగించడం కష్టమవుతుంది. బాలీవుడ్ సినిమాలు చేయడం లేదు. సెటప్‌లు రూపొందిస్తుంది. ప్రముఖ హీరో, డైరెక్టర్, విపరీత గ్లామర్ వంటి అంశాలకే పరిమితమైపోయింది. ఇలాంటి చిత్రాలు ప్రేక్షకులకు నచ్చవు. కేవలం డబ్బు సంపాదన మీదే దృష్టి పెట్టకూడదు. కథ నచ్చి, నటీనటుల ఎంపిక సరిగ్గా చేసుకొని నిజాయితీగా వ్యాపారం చేయాలి. అప్పుడు హిట్లు వస్తాయి. సౌత్‌లో జరిగేది అదే’ అంటూ నిక్కచ్చిగా తన మనసులో మాటను వెల్లడించారు. ఇక అలియా భట్ కూడా స్పందిస్తూ ‘ఏ భాష సినిమా అయినా ఇది మనకోసం తీసిన సినిమా అని ప్రేక్షకుడికి అనిపించాలి. అప్పుడు బాలీవుడ్ సినిమాలు కూడా హిట్ అవుతాయి. కొన్నిసార్లు సినిమాలను ఎవరికోసం తీస్తారో అర్ధం కాదు. అలాంటప్పుడు ఫెయిల్యూర్స్ మాత్రమే వస్తాయి’ అని పేర్కొంది.