RRR సినిమా గురించి దేశం యావత్తు చాలా గర్వపడుతోంది. భారతీయ సినిమాను ఇంటర్నేషనల్ వేదికపై నిలబెట్టడానికి రాజమౌళి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ కు నామినేట్ అవ్వడంతో టాలీవుడ్ అనేది అంతర్జాతీయ వేదికలపై ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పటికే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్స్ సహా పలు అంతర్జాతీయ అవార్డులెన్నో ఈ సినిమాకు వచ్చాయి. ఇక మార్చి 12న ఒకవేళ ఆస్కార్ కూడా వస్తే మాత్రం తెలుగు వాళ్లమైనందకు మనం మరింతగా గర్వపడొచ్చు. ఇదంతా బాగానే ఉన్నా.. మనవాళ్లే .. మనని తక్కువగా చేసి మాట్లాడడం, కించపరుస్తున్నట్లు కామెంట్స్ చేయడం ఎంతో బాధాకరమైన విషయమని ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.
సీనియర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన మనసుకు ఏది అనిపిస్తే అది చెప్పడం ఆయనకు అలవాటు. ఇండస్ట్రీలో సమస్య ఏదైనా దానిమీద ఆయన చేసే వ్యాఖ్యలు ఎన్నో వివాదాలను తీసుకొచ్చి పెట్టాయి. తాజాగా RRRపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆస్కార్ బరిలో నిలిచిన నేపథ్యంలో ప్రచారం కోసం ‘ఆర్ఆర్ఆర్’ (RRR) బృందం రూ.80 కోట్లకు పైగా ఖర్చు చేసిందని అన్నారు. ఫ్లైట్ టికెట్లకు పెట్టిన ఖర్చుతో 8 సినిమాలు నిర్మించవచ్చని సూచించారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో, సినిమా వ్యాపారంలో సామాజిక స్పృహా లోపించిందని చెప్పారు.
హైదరాబాద్ రవీంద్రభారతిలోని ప్రివ్యూ థియేటర్‌లో ఏర్పాటు చేసిన ‘వివాదాస్పద విషయాలపై సినిమాల నిర్మాణం’ అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “ఆర్ఆర్ఆర్ సినిమా కోసం 600 కోట్ల బడ్జెట్ అయింది. మళ్లీ ఆస్కార్ కోసం 80 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ 80 కోట్లు మాకు ఇస్తే ఓ 8 లేదా 10 సినిమాలు తీసి వాళ్ళ మొఖాన కొడతాం.” అని అన్నారు తమ్మారెడ్డి భరద్వాజ్.