కన్నీరు పెట్టిస్తున్న ప్రొఫెసర్ లేఖ - MicTv.in - Telugu News
mictv telugu

కన్నీరు పెట్టిస్తున్న ప్రొఫెసర్ లేఖ

October 31, 2017

మావోయిస్టులతో సంబంధాల ఆరోపణపై నాగపూర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబా తన భార్య వసంతకు రాసిన లేఖ పాఠకులను కన్నీటిపర్యంతం చేస్తోంది. 90 శాతం వికలాంగుడైన ఆయన తీవ్రమైన చలిలో, కనీసం కప్పుకోవడానికి దుప్పటి కూడా లేకుండా తీవ్రజ్వరంతో బాధపడుతున్నారు. ఈ స్థితిలో తానిక ఎంతో కాలం బతకనని ఆవేదనతో ఆయన లేఖ రాశారు. ఆ లేఖ ఆయన మాటల్లోనే..

‘‘ప్రియమైన వసంత,

రాబోయే చలికాలం తలచుకుంటే భయమేస్తోంది. ఇప్పటికే విడువని జ్వరంతో వణికిపోతున్నాను. నా దగ్గర దుప్పటి లేదు. స్వెటర్ గానీ, జాకెట్ గానీ లేవు. ఉష్ణోగ్రత తగ్గిపోయే కొద్దీ నా రెండు కాళ్ళలో, ఎడమ చేతిలో నొప్పి భరించలేనంతగా పెరిగిపోతుంది. నవంబర్ నుండి ఇక్కడ ప్రారంభమయ్యే చలికాలంలో నేను జీవించి ఉండటం అసాధ్యం. చివరి ఊపిరులు తీసుకుంటున్న జంతువులాగా నేనిక్కడ పడి ఉన్నాను. ఎనిమిది నేలలు ఎలాగో ప్రాణాన్ని నెట్టుకొచ్చాను. కానీ వచ్చే చలికాలంలో నేనింక బతకను. నేనిది కచ్చితంగా చెప్పగలను. ఇక మీదట నా ఆరోగ్యం గురించి రాయడం కూడా నిష్ప్రయోజనం.

ఈ నెలాఖరుకల్లా ఎలాగైనా సీనియర్ న్యాయవాదిని ఏర్పాటు చేయి. నవంబర్ మొదటి వారంలో గాని, వీలైతే అక్టోబర్ చివరి వారంలోగానీ నా బెయిల్ అప్లికేషన్ పెట్టమని గాడ్లింగ్ గారికి చెప్పు. ఇలా చేయకపోతే నా పరిస్థితి చేయి దాటి పోతుందని గుర్తించు. దానికి నేను బాధ్యుడిని కాను. దీని గురించి ఇక మళ్ళీ రాసేది కూడా ఉండదని స్పష్టం చేస్తున్నా.

మిసెస్ రెబెక్కా గారితో, నందితా నారాయణ్ తో నువ్వు మాట్లాడాలి. అలాగే ప్రొఫెసర్ హరగోపాల్ తో, మరి కొందరితో కూడా మాట్లాడు. పరిస్థితి వివరంగా చెప్పు. త్వరపడాలి. మీ అందరికీ పదే పదే యాచకుడిలా, దిక్కులేనివాడిలా మొరపెట్టుకొని నేను మానసికంగా కుంగిపోతున్నాను. కానీ ఎవరూ ఒక్క అంగుళం కూడా కదలడం లేదు. నా ప్రస్తుత పరిస్థితి ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. తొంబై శాతం వైకల్యం ఉన్న మనిషి, పని చేస్తున్న ఒకే ఒక చేయితో పోరాడుతూ, అనేక జబ్బులతో బాధపడుతూ జైలు ఊచల వెనక ఉన్నాడని ఎవరూ అర్థం చేసుకోరు. నా జీవితం గురించి ఎవరూ పట్టించుకోరు. ఇది కేవలం నేరపూరిత నిర్లక్ష్యం. నిర్దయాపూరిత వైఖరి.

నీ ఆరోగ్యం జాగ్రత్త. నీ ఆరోగ్యమే నా ఆరోగ్యం, మొత్తం కుటుంబ ఆరోగ్యం. నీ ఆరోగ్యం గురించి ఆలోచించే వాళ్ళు ఇప్పటికైతే ఇంకెవరూ లేరు. నేను నీ దగ్గరికి వచ్చే వరకు నువ్వు నీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకుండా కాపాడుకోవాలి.

బోలెడంత ప్రేమతో
నీ
సాయి’