ప్రియమైన వసంతకి.. నీ సాయి..! - MicTv.in - Telugu News
mictv telugu

ప్రియమైన వసంతకి.. నీ సాయి..!

July 28, 2017

ప్రొఫెసర్ సాయిబాబా…రాజ్యాన్ని కూల్చే ప్రయత్నంలో(ఆరోపణ) జైలు జీవితాన్ని అనుభవిస్తున్నాడు.పౌర హక్కులకోసం,మానవ హక్కులకోసం,నిరంతరం కొట్లాడే ఈయన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్. కేవలం వీల్ ఛైర్ సహాయంతో మాత్రమే జీవించే సాయిబాబా ఎర్రవాడ జైల్ నుంచి తన భార్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సాయిబాబా రాసిన లేఖను ఆయన భార్య వసంత తన ఫేస్ బుక్ వాల్ పై అతికించింది,ఆ లేఖను మీకోసం ,మైటీవీ పాఠకులకోసం పెడుతున్నాం.

ప్రియమైన వసంతకి,

పుట్టిన రోజు శుభాకంక్షలు. ఈ లేఖ నీ పుట్టిన రోజు నాటికి అందుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలని ఆశిస్తూ.

నేను లేకుండ పుట్టిన రోజు జరుపుకుంటున్నందుకు నీవు ఎంతటి వేదనను అనుభవిస్తున్నవో ఉహించగలను. ఏం చేద్దాం రాజ్యం మనల్ని వేరు చేసెందుకు నిశ్చయించుకుంది, కాదు నిర్మూలించాడనికి ప్రయత్నిస్తున్నది. మన 26 సంవత్సరాల వైవహిక జీవితంలో ఎప్పుడు మన సుఖాల కోసం ఆలోచించలేదు. వ్యక్తిగత అభివృద్ది పై శ్రద్ద పెట్టలేదు. 36 యేండ్ల మన సహచర్యం సమాజం కోసమే కదా కొనసాగింది. అయితే ఇప్పుడు నేను నీకు ఒక్కటే చెప్పదల్చుకున్న. అదైర్య పడకు, నమ్మకం కోల్పోకు. ప్రజల పక్షాన నిలబడి వారి హక్కుల కోసం పని చేయి.నేను ఎప్పటికీ నీ పక్కనే ఉంటాను.నాపై కొనసాగుతున్న నిర్భంధం నిన్ను బయపెట్టదు అన్నది నా భావన.నీ పుట్టిన రోజు సందర్భంగా ప్రస్తుత పరిస్ధితిని చాలా ధైర్యంగా ఎదుర్కోవాలి,మనమీద ప్రదర్శిస్తున్న ఈ క్రూరత్వాన్ని,నిర్భందాన్ని చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాన్ని గట్టిగా ఎదురించాల్సిందే.

కేసులు,తీర్పులు,బందీ ఖానాలను చూసి మనం సిగ్గు పడాల్సిన పనిలేదు.మనమీద కొనసాగుతున్న ఈ దాడి రాజ్యాంగానికే తలవంపు.మనం నూతన సమాజాన్ని మెరుగైన ప్రపంచాన్ని కలగన్నాం.అసమానతలులేని సమాజాన్ని కదా మనం కోరుకుంటున్నది.మానవ హక్కులు, పౌర హక్కులు,రాజ్యాంగ హక్కుల కోసం నోరులేని జనం పక్షాన నిలబడ్డాం మనం.మన విలువలతో సరైన పని విధానంతో, అనగారిన ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తూ నిజమైన ప్రజాస్వామ్యంకోసం ముందుకు సాగుదాం నేస్తం.

వాళ్లు మన కలలమీద నమ్మకాల మీద దెబ్బకొట్టచ్చు.కాని మనం స్వప్నించడాన్ని మాత్రం ఆపలేరు కదా.జాగ్రత్తగా మన స్వప్నాలను హృదయంలో భద్రపరుచుకుందాం వసంత.

బూటకపు కేసులు,ఎక్కడో తయారు చేయబడ్డ తీర్పులు,నన్ను బందీగా ఉంచిన తీరుతో నువ్వు డీలా పడద్దు,ధైర్యాన్ని కోల్పోవద్దు,నాజీవితంలో నీ పుట్టినరోజు చాలా ముఖ్యం.నాకు తెలియని ఆనందం అది.నువ్వు కూడా నీ పుట్టినరోజు నాడు సంతోషంగా ఉండాలి వసంత.

పేదలకోసం,సామాన్యుల పక్షాన నిలబడి మాట్లాడుతున్న వారి సంఖ్య తక్కువే కావచ్చు.అయినా రాజ్యం మనల్ని చూసి భయపడుతుంది.మనం ఎవరి పట్లనైనా తప్పుగా ప్రవర్తించామా,ఎవరికైనా హాని తలపెట్టామా,ఎందుకు మన జీవితాల్ని ఇంత చిద్రం చేస్తున్నారు.మన కలల్ని వీరు ఎందుకు నేర పూరితమైనవిగా చూస్తున్నారు,మన కలల్ని ఎందుకు చిదిమేస్తున్నారు.

మన కలల మీద క్రూరమైన,అమానమీయమైన దాడి జరిగే ఈపరిస్థితుల్లో మనం మన చిన్న కలల ప్రపంచంలో ఎలా ఉండగలం?దీన్ని ఎదుర్కొని నిలబడేందుకు అది మనకు శక్తి నిస్తుంది.

ఈ పుట్టిన రోజు నేను నీకు ఏమి ఇవ్వగలను?నా వద్ద ఏం మిగిలి వుందని?అదే ప్రేమ.మనం మొట్ట మొదటి సారి విధ్యార్ధులుగా కలిసినప్పుడు మన మధ్య వికసించిన అదే ప్రేమ తప్ప.నేను ఇంతకాలం నీపై చూపించిన ప్రేమ కన్నా ఎక్కువ ప్రేమను నాపై ప్రసరింపచేసావు.మనం యవ్వన ప్రాయంలో కన్న ఆ ప్రేమానుభూతుల్ని,అవే కలల్ని మాత్రమే ఇవ్వగలను నేను.

ఇప్పుడు నువ్వు నావిముక్తి కోసం ఒంటరి పోరాటం చేస్తున్నదానవు.ఈ చీకటి రోజుల్లో నిరాశ చెందకు.మనం మన ఆశల్ని,కలల్ని కోల్పోకూడదు.ఎందుకంటే ఈ చీకటి ఎప్పటికీ వెలుతురిని దాచి ఉంచలేదు.ఇవి ఒట్టి మాటలు కావు,ఇవి అలంకారపు కవితా ఫంక్తులు అసలే కావు .మన కలలు ఒంటరివి కావని ఎన్నోసార్లు చరిత్ర రుజువు చేసింది.మన ఆశయాలు ఆదర్శపూర్వక ప్రేలాపనలు కావు మనం గెల్వబోతున్నాం.

ఈ ఇనుప చువ్వల వెనక నుంచి..నీ పుట్టిన రోజు నాడు,నీ ప్రేమకు పునరాంకితమవుతున్నాను.నీ ప్రేమతో నాకలల్ని,ఆశయాల్ని,ధైర్యాన్ని కుదేసుకుంటాను.నేను ఇప్పటివరకు జీవితంలో సాధించినవన్ని, నువ్వు నావెంట దీప స్తంభంలా నిలబడి నాపై కురిపించిన ప్రేమ మూలంగానే అవి..అని ఎప్పటికీ మర్చిపోను.

నువ్వు మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ కొండంత ప్రేమతో

ఇట్లు

నీ సాయి.