మా ఊళ్లో మందు తాగం.. పంచాయితీ తీర్మానం - MicTv.in - Telugu News
mictv telugu

మా ఊళ్లో మందు తాగం.. పంచాయితీ తీర్మానం

September 23, 2020

Prohibition of alcohol in the village .. Women's resolution

ఎంతో కాలంగా మద్యం ఎందరి జీవితాలనో బలి తీసుకుంది. ఎన్నో కుటుంబాల్లో తీరని విషాధాన్ని నింపింది. ప్రభుత్వాలకు రాబడి తెచ్చిపెట్టే మద్య నిషేధం ఎప్పటికీ జరగదు. సరదాగా ప్రారంభం అయిన ఆ అలవాటు కాస్తా దురలవాటుగా మారి కాపురాలను కూల్చుతోంది. దీనికి పరిష్కారం ఏంటి? తమను తాము నియంత్రణ చేసుకుని మద్యం వాసన చూడకుండా ఉండలేరా? ఉన్నా ఓ వారం.. తర్వాత మళ్లీ షరామామూలే. అయితే దీనికి ఓ గ్రామం చక్కటి పరిష్కార మార్గాన్ని కనుగొంది. కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు గ్రామస్తులు అందరూ కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో మద్యపాన నిషేధం చేయాలని నిర్ణయించారు. 

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని దస్నాపూర్ గ్రామానికి చెందిన ప్రజలు, మహిళలు గ్రామంలో మద్యపానాన్ని నిషేధించారు. ఇకపై గ్రామంలో ఎవరూ మందు ముట్టుకూడదని ఒట్టు పెట్టుకున్నారు. గ్రామంలోని ప్రజలు తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన తీర్మాన పత్రాన్ని ఇంద్రవెల్లి ఎస్సై నాగ్‌నాథ్‌కి అందజేశారు. ఈ మద్య నిషేధ కార్యక్రమానికి హజరైన మండల పరిషత్ అధ్యక్షురాలు పోటే శోభ, ఇంద్రవెల్లి ఎస్సై నాగ్‌నాథ్‌ల సమక్షంలో గ్రామస్తులు మద్యాన్ని నిషేధిస్తూ తీర్మానం చేశారు.

గ్రామ అభివృద్ధిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు గ్రామ ప్రజలు ఏకాభిప్రాయంగా  చెబుతున్నారు. ‘చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, మా కుటుంబాలను, గ్రామాన్ని అభివృద్ది చేసుకునేందుకు కలిసి ముందుకు సాగాలని నిర్ణయించాం’ అని ఓ మహిళ తెలిపింది. మద్యమే కాకుండా గుడుంబా, పేకాట, గుట్కాలని నిషేధిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గ్రామ అభివృద్దికి తమ వంతు సహాకారం అందిస్తామని పెద్దలు అధికారులు హామీ ఇచ్చారు. ‘చైతన్యపరిచే నిర్ణయం తీసుకున్నారు’ అని గ్రామస్తులను అభినందించారు.