ఇంటర్నెట్ విరివిగా వాడే వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. డీటీహెచ్ తరహాలో నేరుగా ఇళ్లకు వైర్ లెస్ హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసును ప్రారంభించనుంది ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ. ‘ప్రాజెక్ట్ క్యూపర్’ పేరుతో ఇప్పటికే రూ.80 వేల కోట్ల పెట్టుబడితో రంగంలోకి దిగింది. 3వేల 236 శాటిలైట్స్ తయారుచేయించి వాటిని అంతరిక్షంలోకి పంపి.. వాటి ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సర్వీసులు అందించేందుకు 2020లోనే ఈ ప్రాజెక్టును చేపట్టింది.
ఈ శాటిలైట్ ఇంటర్నెట్ ద్వారా అడవులు, మారుమూల ప్రాంతాలు, ఎటువంటి సదుపాయాలు లేని చోట్ల కూడా హై స్పీడ్ నెట్ అవైల్‌బుల్ గా ఉంటుంది. భూమిపై తక్కువ ఎత్తులోని కక్ష్య (లో ఎర్త్ ఆర్బిట్)లో అమెజాన్ శాటిలైట్స్ తిరుగుతూ ఇంటర్నెట్ సేవలు అందిస్తాయి.ఈ శాటిలైట్స్‌ను ప్రయోగించేందుకు అమెజాన్ ఇప్పటికే ఏరియాన్ స్పేస్, బ్లూ ఆరిజిన్, యునైటెడ్ లాంచ్ అలయన్స్ తదితర స్పేస్ కంపెనీలతో ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇక భారతదేశంలో తమ అవసరాలకు అనుగుణంగా సేవలు అందించేవారు కావాలని అమెజాన్ ఇండియా విభాగం ఓ ప్రకటనలో తెలిపింది.