90ml సినిమాను అడ్డుకుంటాం.. పోరాట సమితి హెచ్చరిక - MicTv.in - Telugu News
mictv telugu

90ml సినిమాను అడ్డుకుంటాం.. పోరాట సమితి హెచ్చరిక

December 5, 2019

90ML.

మద్యం వల్ల ఎలాంటి దుష్పరిణాలు ఎదురవుతాయో ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. సంపూర్ణ మద్యపాన నిషేధం ఎప్పటికీ సాధ్యం కాదేమో. మద్యం సేవించి పశువుల్లా ప్రవర్తిస్తున్నవారు ఎందరో. అలాంటి మద్యమే ప్రధాన కథావస్తువుగా ‘90ML’ అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే. 90ఎంఎల్ మద్యం రోజూ తాగకపోతే ప్రాణాలకే ప్రమాదం ఉంటుందనే వినూత్న కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కార్తికేయ హీరోగా, నిర్మాతగా వ్యవహరించాడు. అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబరు 6న విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుదలను అడ్డుకుంటామని మద్యపాన నిషేధం పోరాట సమితి సభ్యులు ప్రకటించారు. అంతేకాకుండా మానవ హక్కుల కమిషన్‌లో ఈ చిత్రానికి వ్యతిరేకంగా పిటిషన్ కూడా వేశారు.

ఈ సినిమా ప్రదర్శితం కాకుండా శాంతియుతంగా అడ్డుకుంటామని సమితి సభ్యులు వెల్లడించారు. చిత్ర విడుదల సమయంలో ఐమాక్స్ థియేటర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతామని తెలిపారు. మద్యపానాన్ని ప్రోత్సహించేలా ఈ సినిమా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని పోరాట సమితి సభ్యులు అన్నారు. ‘ఇలాంటి చిత్రాల వల్లే యువత పెడదోవ పడుతోంది. మహిళలపై అఘాయిత్యాలకు కూడా ఇదే కారణం. మొత్తం సినిమాలో మద్యం సేవించే సన్నివేశాలే ఎక్కువగా ఉన్నాయి. అలాంటి సన్నివేశాలను తొలగించాలి. చిత్ర పేరును కూడా మార్చాలి’ అని తెలిపారు. శేఖర్ రెడ్డి ఏర్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూర్చారు.