Proposal to change the name of Taj Mahal
mictv telugu

తాజ్‌మహల్ పేరు మార్పుకు ప్రతిపాదన.. ఆమోదించే అవకాశం!

August 31, 2022

ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహల్‌పై ఇటీవల కొన్ని వివాదాలు వచ్చాయి. అది శివాలయమని, ఈ విషయాన్ని ప్రాచీన భారత గ్రంథాలు, ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రికార్డులు చెప్తున్నాయని కొందరు వాదిస్తున్నారు. ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ మాట్లాడుతూ.. యోగి ప్రభుత్వం తాజ్ మహల్ పేరును రామ్ మహల్‌గా మార్చుతుందని చెప్పారు. అయితే ఇవన్నీ మాటలకే పరిమితం కాగా, ఆచరణలో రాలేదు. కానీ, తాజ్ మహల్ ఉన్న ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్‌లో ఓ కౌన్సిలర్ పేరు మార్పు ప్రతిపాదన చేశారు. తేజో మహాలయగా మార్చాలని బీజేపీ కౌన్సిలర్ శోభారామ్ రాథోడ్ ప్రతిపాదించారు. తాజ్ మహల్‌లో కమలంతో కూడిన కలశం ఉన్నట్టు తన వద్ద ఆధారాలు ఉన్నాయని ప్రతిపాదనలో తెలిపారు. అలాగే దీనికి సంబంధించిన తీర్మానాన్ని బుధవారం ఆగ్రా నగర పాలక సంస్థకు సమర్పించారు. అయితే దీనిపై సంస్థ పాలక సభ్యులు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాగా, తాజ్ మహల్‌లో ఉన్న 22 గదులను తెరిపించి అందులో దాగి ఉన్న నిజాలను వెలికితీయాలని కొన్ని నెలల క్రితం అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కానీ కోర్టు దానిని తిరస్కరించింది.