వీడియో : మాల్దీవుల్లో యోగా అభ్యాసకులపై దాడి.. ఇస్లాంకు వ్యతిరేకమంటూ - MicTv.in - Telugu News
mictv telugu

వీడియో : మాల్దీవుల్లో యోగా అభ్యాసకులపై దాడి.. ఇస్లాంకు వ్యతిరేకమంటూ

June 21, 2022

మంగళవారం ఐక్యరాజ్యసమితి అధికారికంగా గుర్తించిన యోగా డేను భారతదేశంలో ఘనంగా జరుపుకున్నారు. విదేశాల్లో ఉండే భారతీయులు కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని యోగా అభ్యాసం చేశారు. ఈ క్రమంలో భారతీయ సంతతి ప్రజలు ఎక్కువగా ఉండే మాల్దీవుల్లోనూ యోగా ప్రోగ్రాం నిర్వహించారు. రాజధాని మాలెలో ఉన్న భారత ఎంబసీ ఓ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహించగా, యోగా ఇస్లాంకు వ్యతిరేకమంటూ కొందరు ఆందోళనకారులు స్టేడియంలోకి దూసుకొచ్చారు. ప్లకార్డులు పట్టుకొని, జెండాలతో చొరబడ్డారు. దౌత్య సిబ్బంది, ప్రభుత్వ అధికారులతో పాటు మరికొందరు యోగా చేస్తుండగా, ఒక్కసారిగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారి రాకతో యోగా చేస్తున్న వ్యక్తులు ఆందోళనకు గురై అక్కడినుంచి పరుగులు తీశారు. ఈ ఉద్రిక్త పరిస్థితులు నడుమ పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. పెప్పర్ స్ప్రేతో చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన దేశ ప్రభుత్వం ఆరుగురు నిందితులను పట్టుకుని అదుపులోకి తీసుకుంది. ఘటనపై పోలీసుల విచారణ మొదలైందని, దోషులను చట్టం ముందు నిలబెడతామని అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సోలిహ్ ప్రకటించారు.