దెయ్యాలు ఉన్నాయని నిరూపిస్తే రూ.50 వేలు ఇస్తా.. కలెక్టర్ - MicTv.in - Telugu News
mictv telugu

దెయ్యాలు ఉన్నాయని నిరూపిస్తే రూ.50 వేలు ఇస్తా.. కలెక్టర్

October 24, 2019

Prove that there are ghosts and give Rs.50 thousand .. Collector

పిల్లలకు జ్వరం వస్తే ఏదో గాలి సోకిందని భావించేవాళ్ళు ఇంకా ఉన్నారు. తొక్కుడు అయింది గుడ్డు తిప్పి, నాలుగు తొవ్వల కూడలిలో పారేసి వచ్చేవారు ఇంకా ఉన్నారు. అమావాస్య రాత్రిపూట దెయ్యాలు తిరుగుతాయని, పిశాచాలు పట్టుకుంటాయని, మంత్రాలు, బానవతులు ఉన్నాయని నమ్మేవారు కోకొల్లలు. బహుశా ఈ సమాజం సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా అలాంటివారు ఉంటూనే ఉంటారేమో. దీనిని క్యాష్ చేసుకోవడానికి దొంగబాబాలు పుట్టలుగా పుట్టుకొస్తున్నారు. మరి ఇలాంటి మూఢ నమ్మకాలు పోవాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నను ఓ కలెక్టర్ ఒకటికి పదిసార్లు వేసుకున్నట్టున్నారు. ఏదో ఒకటి చేస్తే గానీ, ఈ దురాచారం పోదని భావించారు. ఈ క్రమంలో ఆయన ఓ సంచలన ప్రకటన చేశారు. 

దెయ్యాలు ఉన్నాయని ఎవరైనా నిరూపిస్తే వారికి రూ.50 వేల నగదు బహుమతి ఇస్తానని ప్రకటించారు. ప్రజల్లో మూఢనమ్మకాలు, క్షుద్రపూజల పట్ల అవగాహన కల్పించడం కోసమే తాను ప్రయత్నిస్తున్నానని అంటున్నారు ఆయన. ఆయన పేరు విజయ్ కులాంగే. ఒడిశాలోని గంజా జిల్లాకు విజయ్ కులాంగే కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. దేశంలో మూఢ నమ్మకాలను విశ్వసించేవారు చాలామంది తయారయ్యారని.. ఒడిశాలో అలాంటివాళ్లు ఇంకా ఎక్కువగా ఉన్నారని అంటున్నారు ఆయన. ఈ నేపథ్యంలో ఎవరైనా దెయ్యాలు ఉన్నాయని ఆధారాలతో సహా వస్తే వారికి రూ.50 వేలు బహుమతి ఇస్తానని ప్రకటించారు. దెయ్యాన్ని చూపించినవారికి తన సొంత డబ్బులే ఇస్తానని స్పష్టంచేశారు. రోగులను ఆసుపత్రికి తీసుకెళ్లాలని, నాటు వైద్యాలు, ఇతర మంత్ర విద్యలను ఆశ్రయించరాదని ఆయన కోరుతున్నారు.