PS1 costume designer Ikha lakhani expereinces
mictv telugu

దుస్తుల డిజైనింగ్‌ కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఒక ఫ్లోర్‌ను ఫ్యాక్టరీగా మార్చేశాం

November 9, 2022

పొన్నియన్ సెల్వన్…గత నెల విడుదల అయిన ఈ సినిమా హాట్ టాపిక్ అయింది. మణిరత్నం చాలా రోజుల తర్వాత తీసిన ఈ సినిమాపై చాలానే డిస్కషన్స్ నడిచాయి. మళ్ళీ ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాను విడుదల చేశారు. దీంతో మళ్ళీ పొన్నియన్ సెల్వన్ గురించి మాట్లాడుకుంటున్నారు. కొంతమందికి బాగా నచ్చితే మరికొంతమందికి అస్సలు నచ్చలేదు. కానీ అందరికీ ఏకగ్రీవంగా నచ్చిన విషయం మాత్రం కాస్ట్యూమ్స్, మేకప్. త్రిష, ఐశ్వర్యారాయ్ లు సినిమాలో మెరిసిపోయారు. వీళ్ళు అందంగా మెరిసిపోవడానికి కారణం ఇఖా లఖానీ. ఎవరీ అమ్మాయి? ఈ సినిమా కోసం ఏం చేసిందో చూద్దామా.

వెయ్యేళ్ల నాటి కథ అది. అలనాటి రాజులు, పట్టపు రాణులను వెండితెరపై చూపడం పెద్ద సవాల్‌. ముఖ్యంగా ఆహార్యం, వస్త్రధారణ… అంతటి బాధ్యతను నిర్వర్తించే అవకాశం వస్త్ర డిజైనర్‌ 32 ఏళ్ళ ఇఖా లఖానీకి దక్కింది. ఏళ్ళ పరిశోధన, అధ్యయనంతో ప్రశంసలనూ అందుకుంటోంది. కాస్ట్యూమ్‌ డిజైనర్‌ అవుతాననుకున్నా.. మణిరత్నంతో కలిసి పనిచేస్తానని మాత్రం కల్లోనూ అనుకోలేదు. భారీ చిత్రానికి పని చేయాలనే నా కల ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ తీర్చింది అంటోంది ఇఖా లఖానీ.

ఇఖాది ముంబయ్. నాన్న టెక్స్‌టైల్‌ డిజైనర్‌. వాళ్ళకు బ్లాక్‌ ప్రింటింగ్‌ యూనిట్‌ ఉండేది. వర్ణభరిత వస్త్రాల మధ్య పెరిగింది. అందుకేనేమో డిజైనింగ్‌పై ఆసక్తి అంటుంది ఇఖా. తన వ్యాపారంలో చేరమని నాన్న అడిగారు, సరేనన్నా అని చెప్పింది. పరిజ్ఞానం కోసం ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేశా. నైపుణ్యాలను పెంచుకోవాలని న్యూయార్క్‌ ఫ్యాషన్‌ ఇనిస్టిట్యూట్‌లోనూ శిక్షణ తీసుకున్నా. ఆ తర్వాత ఇంటర్న్‌ షిప్‌ చేయాలనుకుంటున్నప్పుడు ప్రముఖ డిజైనర్‌ సవ్యసాచి ముఖర్జీకి సహాయకురాలిని వెతుకుతున్నారని తెలిసి, వెళ్ళా. అప్పటికి ఆయన ‘రావణన్‌’ చేస్తున్నారు. కాస్ట్యూమ్‌ అసిస్టెంట్‌ బృందంలో చోటుందంటే చేరా….అక్కడ అలా మొదలయ్యింది మణిరత్నంతో తన జర్నీ అని చెబుతోంది.

మణిరత్నంతో పని చేసేటప్పుడు అంతా పక్కాగా ఉండాలి. తను చెప్పినట్లు చేసి చూపిస్తే, చాలా బాగా చేశావు. అద్భుతంగా ఉంది. మరింత బాగా చేద్దామని ప్రోత్సహిస్తారు. ఈ సినిమా అంగీకరించాక మణి ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ నవలను పంపి చదవమన్నారు. తంజావూరు వెళ్లి ఆలయాలు, శిల్పాలను అధ్యయనం చేయమన్నారు. అక్కడ ఆలయాలన్నీ తిరిగి, బొమ్మలు, శిల్పాలను నిశితంగా అధ్యయనం చేశా. అంత చేసినా చిత్రం స్క్రిప్టు చూశాక నేనింకా కష్టపడాలని అర్థమైంది. పైగా ఈ సినిమా మణిరత్నం 34 ఏళ్ల కల అంటోంది ఇఖా.

12వ శతాబ్దపు ఆహార్యాన్ని చూపడం కోసం ఆ కాలం సంప్రదాయం, దుస్తులు వంటి అంశాలపై పరిశోధన చేసిన వారిని కలిసి సమాచారాన్ని సేకరించా అంటోంది ఇఖా. కంచి చేనేత కళాకారులను సంప్రదించా. ఈ సినిమాలో పూర్తిగా అక్కడి చేనేత వస్త్రాలనే వినియోగించాం. బంగారు జరీ, ఎంబ్రాయిడరీతో దుస్తులను డిజైన్‌ చేశా. ఆ అధ్యయన ఫలితమే తెరపైన కనిపించింది. వీటికి వస్త్రాన్ని ఎంచుకునే విషయంలో మణి సర్‌ నాకు స్వేచ్ఛనిచ్చారు. చిత్రకారుడు మణియం బృందం ప్రతి పాత్రకూ వేసిన స్కెచ్‌లను పరిశీలనకు తీసుకునేవాళ్లం. అక్కడక్కడా కాటన్‌, మస్లిన్‌, మఖమల్‌ వస్త్రాల్నీ ఎంచుకొన్నాం అని చెబుతోంది .

దుస్తుల డిజైనింగ్‌ కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఒక ఫ్లోర్‌ను ఫ్యాక్టరీగా మార్చేశాం. డయింగ్‌తోపాటు టైలర్లు, సహాయ సిబ్బంది.. ఇలా వందల మందితో రద్దీగా ఉండేది. రాజులు, పట్టపురాణులు వంటి వారంతా సీన్‌లో ఉన్నప్పుడు మరింత పని ఉండేది. ఇంత పెద్ద ప్రాజెక్టుకు అవకాశం వచ్చినందుకు ఓ పక్క సంతోషం.. మరోవైపు భయంగా ఉండేదని అంటోంది ఇకా లఖానీ. కానీ తన కష్టానికి ఫలితం దక్కినందుకు హ్యాపీగా ఉందని చెబుతోంది.

తన ఈ 11 ఏళ్ల కెరియర్‌లో మణిరత్నం సహా రాజ్‌కుమార్‌ హిరాణి, కరణ్‌ జోహర్‌, గౌతం మీనన్‌ వంటి ప్రముఖులతో పని చేసే అదృష్టం దక్కింది. బయోపిక్‌, వెబ్‌ సిరీస్‌లు సహా 31 చిత్రాలకు పనిచేయగలిగా. పని పట్ల ప్రేమ, రాజీపడకపోవడం, నైపుణ్యాల్ని మెరుగు పరుచుకుంటూ ఉండటమే నా విజయ రహస్యాలు అనుకుంటాను అని చెబుతున్న ఇకా లఖానీ మరిన్ని విజయాలను అందుకోవాలని మనమూ కోరుకుందాం.