పబ్బుకు పోయిన పోలీస్.. సీన్ సితార అయింది !? - MicTv.in - Telugu News
mictv telugu

పబ్బుకు పోయిన పోలీస్.. సీన్ సితార అయింది !?

August 7, 2017

ఈ పబ్బు ఎట్లా నడుపుతావ్ ? నన్ను కాదని అడుగేస్తావా ? నా తడాఖా చూపిస్తా, నీ అంతు చూస్తా.., ఈ వార్నింగ్ ఏ పహిల్వానో, ఏ గల్లీ లీడరో ఇచ్చినవి కావు. జూబ్లీహిల్స్ ఎస్సై గురుస్వామి గురువింద మాటలు. అన్నీ తెలిసినా ఒక్కొక్కసారి తెలివి తక్కువ పనులు చేస్తుంటారు. అలాంటి పనినే ఈ గురుస్వామి కూడా చేసాడు. కాక్ టెయిల్ పబ్బులో సిసి కెమెరాలున్న సంగతిని మరిచిన గురుస్వామి పబ్బు నిర్వాహకులు పన్నిన పన్నాగంలో చిక్కుకున్నాడు. రెండు నెలల నుండి పబ్బు యాజమాన్యం గురుస్వామిని ట్రాప్ చెయ్యాలనే విజయవంతం అయ్యింది.

గురుస్వామి సంగతి పక్కన పెడితే పెద్ద పోలీసుల సంగతేంది ?

పిల్లి మెడలో గంట కట్టాలనే ప్రయత్నం. పాపం ఎవరి వల్లా సాధ్యం కావడం లేదు ? ఎవరా పిల్లి ? ఏమా గంటా ? హైదరాబాదులో పబ్ కల్చర్ కు రోజురోజుకు మితిమీరిపోతోంది. అందుకు తాజా ఉదాహరణలు కూడా మన ముందున్నాయి. డ్రగ్స్ కేసుల విచారణలో డ్రగ్స్ మాఫియా పబ్బులను, డిస్కోలను కేంద్రంగా చేస్కొని తమ పని కానిచ్చాయనేది అందరికీ తెల్సిన సత్యమే. అయితే అన్నీ బార్ అండ్ రెస్టారెంట్స్ లాగానే పబ్బులు, డిస్కోలు కూడా సమయపాలన పాటించాల్సి వుంటుంది. కానీ ఎక్కడా అది అమలు కావడం లేదు. అందుకు అనేక కారణాలున్నాయి. పబ్బులు, డిస్కోల్లో వాటాదారులుగా గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్లు వున్నట్టు ప్రచారం అయితే వుంది. ఇలా వుంటే ఈ పబ్బులను, డిస్కోలను వాటి సమయపాలనను నియంత్రించాలని ఎప్పట్నించో పోలీస్ శాఖ అనుకుంటున్నది. కానీ అమలుకు నోచుకోవడం లేదు.

అసలు విషయానికొస్తే అది జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి దగ్గరున్న కాక్ టెయిల్ పబ్బుతో పాటు నగరంలోని పబ్బులన్నీ రోజూ రెండు మూడు గంటల వరకు నడుస్తూనే వున్నాయి. ఈ క్రమంలో పబ్బులను బందు చెయ్యాలని చాలా సీరియస్ గా పోలీస్ శాఖ ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అయితే గత కొంత కాలంగా కాక్ టెయిల్ పబ్బు నిర్వాహకులతో ఎస్సై గురుస్వామికి సంబంధాలు తెగిపోయినట్టున్నాయి. ఈ క్రమంలో గురుస్వామి ఆ పబ్బుపై రోజూ తన గస్తీలో భాగంగా బందు చెయ్యమని కోరుతున్న సమయంలోనే గురుస్వామి టీంకు కాక్ టెయిల్ పబ్బు నిర్వాహకులకు మధ్య వాగ్వివాదం జరింగింది. అక్కడ సిసి కెమెరాలున్న సంగతిని గురుస్వామి మరిచిపోయి దొరికిపోయాడు. సీన్ కట్ చేస్తే ఎస్సై గురుస్వామిని హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేస్తూ పోలీస్ శాఖ నిర్ణయం తీస్కుంది. ఇప్పుడు అసలు ప్రశ్న. అసలు గురుస్వామిని ఎందుకు హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేసినట్టు ? పోలీస్ శాఖలో గురువింద గింజలు ఇంకా లేవా అంటే చాలానే వున్నాయి కానీ సిసి కెమెరాలకు చిక్కడం లేదు. చిక్కితే చూద్దామంటారు పోలీస్ శాఖ.

ఎవరదీ కాక్ టెయిల్ ?

పోలీస్ అధికారులనే సస్పెండ్ చేయించేంత దమ్మున్న కాక్ టెయిల్ పబ్బు నిర్వాహకులను నడిపిస్తున్నదెవరు ? పోలీస్ అధికారులనే శాసిస్తున్నారంటే ఈ పబ్బు నిర్వాహకుడు ఎంతటి ఘనాపాటి అయ్యుంటాడో వూహించవచ్చు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పోలీసులు చేతులు ఎత్తేయ్యాల్సిందే. ఇప్పటికైనా తేరుకొని తెల్లార్లూ నడుస్తున్న పబ్బుల మీద చర్యలు తీస్కొని తర్వాత పోలీసులు మీద తీస్కుంటే బాగుంటుంది.