ఓ ప్రైవేట్ కాలేజీకి చెందిన విద్యార్థినీ విద్యార్థులంతా పబ్లో పార్టీ చేసుకుందామని అక్కడకు వెళ్లారు. కొన్ని గంటల్లో పార్టీ మొదలుకావాల్సి ఉంది. అయితే ఇంతలో అక్కడికి సడెన్గా భజరంగ్ దళ్ కార్యకర్తల పేరుతో కొందరు ఆ పబ్ వద్దకు చేరుకొని, అక్కడున్న వారంతా వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. కర్ణాటకలోని మంగళూరులో నిన్న రాత్రి జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. రాత్రి 8 గంటల సమయంలో Re-Cycle The Lounge అనే పబ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
#BajrangDal members barged into pub at #Balmatta road #Mangalore & objected to women partying at the venue. They even allegedly hurled abuses at them. Venue was cleared & people inside were sent out.
This was the same pub which was attacked during 2009 by #SriRamSene members. pic.twitter.com/QZfncGNGlH
— Hate Detector 🔍 (@HateDetectors) July 25, 2022
భజరంగ్ దళ్ కార్యకర్తలు అక్కడికి వెళ్లిన తర్వాత స్టూడెంట్స్ అంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇద్దరు అమ్మాయిలు పబ్లో నుంచి వెళ్లిపోతున్న దృశ్యాలు, పబ్ బయట కొందరు అబ్బాయిలు నిలబడి ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ ఎన్.శశి కుమార్ ఈ ఘటనపై మాట్లాడుతూ.. మీడియా ద్వారా తమకు ఈ విషయం తెలిసిందని.. కొందరు పబ్లో అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నాయని అక్కడికి వెళ్లి.. ఆ పార్టీని నిలిపివేశారని చెప్పారు. తమ పోలీసులకు ఈ విషయం తెలిసి అక్కడికి వెళ్లినట్లు ఆయన తెలిపారు. పోలీసులు వెళ్లిన సమయానికి ఆ పబ్ వద్ద నుంచి 20 మంది అబ్బాయిలు, 10 మంది అమ్మాయిలు వెళ్లిపోతూ కనిపించారని సీపీ చెప్పారు.
భజరంగ్ దళ్ జిల్లా హెడ్ శరణ్ కూడా ఈ ఘటనపై స్పందించారు. ఇదే కాలేజీకి చెందిన విద్యార్థులకు సంబంధించిన ఒక అభ్యంతరకర వీడియో కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయిందని చెప్పారు. అదే కాలేజీకి చెందిన విద్యార్థులు పబ్లో పార్టీకి ప్లాన్ చేసుకున్నారని తెలిపారు. దీంతో.. తమ కార్యకర్తలు ఆ పార్టీని అడ్డుకునేందుకు పబ్ వద్దకు వెళ్లారని శరణ్ స్పష్టం చేశారు.