కుర్రకారును ఉర్రూతలూగించి, వెంట్రుకలు నిక్కబొడిగించే పబ్జీ గేమ్ భారత్‌లోకి మళ్లీ వచ్చేస్తోంది. కేవలం భారతీయుల కోసం ప్రత్యేక రూపొందించిన వెర్షన్‌ను తీసుకొస్తున్నట్లు పబ్జీ కార్పొరేషన్ అధికారికంగా ప్రకటించింది. ‘పబ్జీ మొబైల్ ఇండియా’ పేరుతో దీన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. అలాగే పబ్జీ భారత్‌లో 10 కోట్ల డాలర్ల పెట్టుబడి కూడా పెట్టనుంది.
సరిహద్దులో చైనాతో ఉద్రిక్తత, గోప్యత ఉల్లంఘన, డేటా చోరీ ఆరోపణలపై భారత ప్రభుత్వం పబ్జీని నిషేధించడం తెలిసిందే. దీంతోపాటు వందలాది చైనా యాప్స్‌ను కూడా నిషేధించారు. దేశరక్షణ, కోసం దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపిందే. నిషేధం వల్ల లక్షల కోట్ల ఆదాయానికి గండి పడటంతో తిరిగి భారత్‌లోకి ప్రవేశించేందుకు పబ్జీ కార్పొరేషన్ ప్రయత్నిస్తోంది.
భారత ప్రభుత్వం నిబంధనల ప్రకారం. సురక్షితమైన ఆరోగ్యకరమైన కొత్త వెర్షన్ గేమ్‌ప్లేను తీసుకొస్తామని పబ్జీ కార్పొరేషన్ తెలిపింది. పబ్జీ కార్పొరేషన్ మాతృసంస్థ అయిన క్రాఫ్టన్ ఇటీవల మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందాలు చేసుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ‘పబ్జీ మొబైల్ ఇండియా’ను ఎప్పుడు అధికారంగా విడుదల చేస్తారో కంపెనీ స్పష్టంగా చెప్పలేదు. పబ్జీ తిరిగి వస్తోందన్న వార్తలపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ గేమ్ కారణంగా మనదేశంలో వందలమంది ఆత్మహత్య చేసుకోవడం, నేరాలకు పాల్పడ్డం తెలిసిందే.