మొన్నటివరకు 500, 600 ధర పలికిన వండుకునే గ్యాస్ ధర ఇప్పుడు రెట్టింపైంది. పొయ్య వెలగాలంటే రూ. 1200 సమర్పించుకోవాల్సిందే. కేంద్రం ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచడంతో సామాన్యుడిపై గ్యాస్ బండ గుదిబండగా మారుతోంది. కాస్త పన్నుపోటును తగ్గించి సామాన్యులకు ఊరటనివ్వాల్సిందిపోయి మరింత భారం మోపుతోంది కేంద్రం. ఈ నేపథ్యంలో ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి నెలకు ఒక సిలిండర్ పై రూ. 300 సబ్సిడీ ఇస్తామని ప్రకటించారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతూ ఈ విషయం వెల్లడించారు. దీంతో అర్హులైన ప్రతి కుటుంబానికి ఏడాదికి 12 సిలిండర్లపై రూ. 3600 సబ్సిడీ దక్కనుంది. దీని కోసం బడ్జెట్లో రూ. 126 కోట్లు కేటాయించారు. పేదల కష్టాలను దృష్టిలో ఉంచుకునే ఉడతా సాయంగా ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం వెల్లడిచారు.