ఇప్పటివరకూ సినిమాల్లోనే నటిస్తూ వస్తోన్న లావణ్య త్రిపాఠీ, ఆది సాయికుమార్ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన లేటెస్ట్ సిరీస్ కావడం, కమర్షియల్ రైటర్ కోన వెంకట్ కథ అందించడంతో ‘పులిమేక’ సిరీసుపై ప్రేక్షకుల్లో కొంత హైప్ క్రియేటయింది. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కావడంతో ఆ జానర్ ఆడియెన్సులో ఆసక్తి పెరిగింది. మరి ఎనిమిది ఎపిసోడ్లుగా ఓటీటీలో రిలీజైన ఈ తాజా సిరీస్ ఏ మేరకు ఆకట్టుకోగలిగింది? ఎంత వరకు సస్పెన్సును ఎంగేజ్ చేయగలిగింది?
కథ విషయానికొస్తే..
వింత జంతువు ముసుగులో ఓ సీరియల్ కిల్లర్ పోలీసులని చంపుతూ ఉండడంతో ఆ కేసు ఇన్వెస్టిగేషన్‌ను కిరణ్ ప్రభ (లావణ్య త్రిపాఠి)కి అప్పగిస్తాడు కమిషనర్ అనురాగ్ నారాయణన్ (సుమన్). ఆ కేసును ఛేదించడంలో భాగంగా ఫోరెన్సిక్ హెడ్ ప్రభాకర్ శర్మ (ఆది సాయికుమార్) కూడా టీములో జాయినవుతాడు. అందరూ కలిసి ఆ సీరియల్ కిల్లర్ ని ఎలా పట్టుకున్నారు? అసలు ఆ కిల్లర్ హత్యలెందుకు చేస్తున్నాడు అనేదే అసలు కథ.
కథనం ఎలా ఉందంటే..
మొదటి ఎపిసోడ్ నుంచే ప్రధాన పాత్రల్ని పరిచయం చేస్తూ ముఖ్యకథలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లాడు డైరెక్టర్. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లలో నాలుగో ఎపిసోడ్ దగ్గర కథను మలుపుతిప్పే ట్విస్ట్ రావడంతో తర్వాతి ఎపిసోడ్లపై ఆసక్తి పెంచాలని బానే ప్రయ్నతించారు. కోన వెంకట్ అందించిన కథాపరంగా గొప్ప ఎలిమెంట్స్, సరికొత్త హైలెట్స్ ఏమీ లేకపోయినా సిరీసును రక్తి కట్టించడానికి దర్శకుడు చక్రవర్తి రెడ్డి బానే కష్టపడ్డాడు. గోపీచంద్ హీరోగా నటించిన ‘పంతం’ సినిమాకి కూడా చక్రవర్తే డైరెక్టర్. అంతో ఇంతో ఆ అనుభవం ఉన్నా కూడా ఈ సిరీసులో పెద్దగా కలిసిరాలేదు. చాలా ట్విస్టుల్ని ముందే ఊహించేయొచ్చు. కథనంలో కొన్ని లోపాలున్నా, సింపుల్‌గా ఓ గంటన్నర సినిమాగా తీయగలిగే కథతో సిరీసుని లాగించినా పర్వాలేదనిపించింది. మేకింగ్ అండ్ రైటింగ్ లిబర్టీతో డిజైన్ చేసుకున్న కొన్ని సీన్లు లాజిక్‌ని దెబ్బతీశాయి. ఓ ఇన్వెస్గిగేటివ్ థ్రిల్లర్‌లో ఉండే సస్పెన్స్ చాలాచోట్ల పండకపోవడంతో ప్రేక్షకుడు పెద్దగా ఎంగేజవడు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం, రామ్ . కె. మహేష్ కెమెరా వర్క్ పర్వాలేదనిపిస్తాయి. ప్రధాన పాత్రగా లావణ్య త్రిపాఠి కాస్ట్యూమ్స్, స్క్రీన్ ప్రజెన్స్ వరకూ గ్లామర్‌గానే ఉన్నా ఇంటెన్సిటీ మాత్రం సోసోనే. ఇక ఆది సాయికుమార్, లావణ్య మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు కూడా పెద్దగా పొసగలేదు. సుమన్, సిరి హనుమంతు, గోపరాజు రమణ, రాజా చెంబోలు ఎవరి పాత్రల మేర వారు లాగించేశారు.
ఓవరాల్‌గా ఎలా ఉందంటే..
ముందుగానే ఊహించగలిగే ట్విస్టులతో, పెద్దగా ఎంగేజ్ చేయలేని సస్పెన్స్ ఎలిమెంట్సుతో సాగినా.. ఓటీటీలోనే అందుబాటులో ఉంది కాబట్టి.. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీసులు చూసే ప్రేక్షకులు టైమ్ పాస్ కోసం ఓసారి చూసేయొచ్చు.