2019 ఫిబ్రవరి 14. భారత చరిత్రలో ఒక విషాద దినం. అప్పటివరకూ తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపి భరతమాత రక్షణ కోసం ఆనందంగా విధులకు వెళ్తున్న 40 మంది జవాన్లు.. ఆత్మాహుతి దాడిలో అమరులైన రోజు. జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఈ దాడితో దేశం ఒక్కసారి ఉలిక్కి పడింది. శ్రీనగర్ జాతీయ రహదారిలో పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRFP) సిబ్బంది కాన్వాయ్ మీద ఆత్మాహుతి దాడి చేసి నేటికీ నాలుగేళ్లు పూర్తయ్యాయి.
ఆ రోజు ఏం జరిగిందంటే..
ఫిబ్రవరి 14, 2019 న దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా ప్యారామిలిటరీ వాహనాలు వరుసగా వెళ్లుతున్నాయి. ఆ కాన్వాయ్‌లోని రెండు వాహనాలను ఓ సూసైడ్ బాంబర్ టార్గెట్ చేసుకున్నాడు. ఓ కారులో ఐఈడీతో వచ్చి నేరుగా ఢీకొన్నాడు. ఆ రెండు బస్సుల్లోని 40 మంది జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి జరిగిన కొద్ది సేపటికి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఓ వీడియో విడుదల చేసింది. ఈ ఘాతుకానికి బాధ్యత తమదే అని తెలిపింది. ఆ వీడియోలో సూసైడ్ బాంబర్ తనను తాను కశ్మీరి జిహాదిస్ట్ ఆదిల్ అహ్మద్ దర్(22)గా చెప్పుకున్నాడు. పుల్వామా జిల్లాలోని కాకపోరాలో గుండిబాగ్ నివాసి అని తెలిపాడు. తమ కుమారుడు 2018 లో అదృశ్యమయ్యాడని అతడి తల్లిదండ్రులు తెలిపారు.
ఫిబ్రవరి 14 బ్లాక్ డే
ఇక అప్పటి నుంచి ప్రతి ఏడాది .. ఈ దాడిని ఖండిస్తూ.. మన దేశానికి ఒక చీకటి రోజు అంటూ అమరవీరులకు నేడు నివాళులు అర్పిస్తోంది. ఫిబ్రవరి 14వ తేదీని బ్లాక్ డేగా పాటిస్తున్నారు. వీర సైనికుల సేవలను స్మరించుకుంటూ.. దేశ వ్యాప్తంగా ఘన నివాళులు అర్పిస్తున్నది. పుల్వామా దాడి జరిగిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. క్రూరమైన దాడిని ఖండిస్తూ.. ప్రతి ఒక్కరూ తమ సంతాపాన్ని తెలుపుతూనే ఉన్నారు. కాలిపోయిన మృతదేహాలు, కాలిపోయిన ట్రక్కులు, మారణహోమం జరిగిన ప్రాంతం.. హృదయాన్ని కదిలించే దృశ్యాలు అన్ని వార్తలలో నిలిచాయి.