రామమందిరం కట్టకపోతే భారత్ మరో సిరియా.. రవిశంకర్ - MicTv.in - Telugu News
mictv telugu

రామమందిరం కట్టకపోతే భారత్ మరో సిరియా.. రవిశంకర్

March 5, 2018

ప్రశాంత వదనం, చిర్నవులతో కనిపించే ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్‌ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌కు బాగా కోపమొచ్చింది. రామమందిరం-బాబ్రీ మసీదు వివాదంపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామమందిరాన్ని కట్టకపోతే భారత్ మరో రక్తసిక్త సిరియాగా మారుతుందని హెచ్చరించారు. సిరియా భద్రతాదళాల దాడుల్లో బలవుతున్న అమాయాకుల ప్రజలు, పిల్లల మరణాలపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. అయోధ్యను జనమే పరిష్కరించుకోవాలని, కోర్టు తీర్పులు అంగీకారయోగ్యం కావని అన్నారు.రాముడిని మరోచోట ఎలా పుట్టిస్తారు?

‘రామమందిరం-బాబ్రీ మసీదు వివాదం  పరిష్కారం కావడం లేదు. దీంతో భారత్‌లోనే మరో సిరియాను చూడాల్సిన పరిస్థితులు వస్తాయి. సిరియా మారణకాండ నుంచి ముస్లింలు గుణపాఠాలు నేర్చుకోవాలి. అయోధ్య వివాదంపై వారు ఆశలు వదులుకుని వెనక్కి తగ్గాలి’ అని ఇండియా టుడే వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ‘అయోధ్య అంశం కేవలం ముస్లింలకు సంబంధించినది కానేకాదు. రాముడిని అక్కడ కాకుండా మరోచోట పుట్టించడం అసాధ్యం. ఈ వివాదాస్పద ప్రాంతాన్ని ఇస్లాం ఎప్పటికీ కోరుకోదు..’ అని అన్నారు.

అయితే తాను ఏకపక్షంగా మందిర నిర్మాణం కోరుకోవడం లేదని, హిందువులు, ముస్లింల పరస్పర ఆమోదంతో అది జరగాలని ఆయన ముక్తాయించారు. ‘ముస్లింలకు మసీదు కోసం మరోచోట ఐదెకరాల స్థలాన్ని ఇవ్వాలి. అక్కడే మసీదు కట్టుకోవడం వారికి ఉత్తమం.  వివాదాస్పద స్థలంలో రాముడిగుడి నిర్మించేందుకు ముస్లింలు పూర్తి మద్దతివ్వాలి..’ అని అన్నారు. బాబరీ మసీదును కూల్చిన చోట అన్నిమతాలకు ఉపయోగపడే ఆస్పత్రో, స్కూలో కట్టాలన్నారు.