కరోనా మజాకా.. 1 కి.మీకి రూ. 1,142 - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా మజాకా.. 1 కి.మీకి రూ. 1,142

July 9, 2020

corw

కరోనా సమయంలో తోటివారికి సాయం చేయాలనే ఇంగితం లేకుండా కొందరు దళారుల్లా రెచ్చిపోతున్నారు. అటు ప్రైవేట్ ఆసుపత్రులు, ఇటు మందుల షాపులవాళ్లు దోపిడీకి దిగుతున్నారు. తాజాగా పేషెంట్‌ను తరలించినందుకు భారీగా డబ్బులు వసూలు చేసిన ఓ అంబులెన్స్ నిర్వాకం వెలుగుచూసింది. దీంతో అంబులెన్స్ నిర్వహకుడిపై పూణె పోలీసులు కేసు నమోదు చేశారు. బిబ్వేవాడీ ప్రాంతంలోని ఓ ఆసుపత్రిలో బాధితుడికి కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా పాజిటివ్ అని తేలింది. దీంతో అతడు ఎరండ్వానే ప్రాంతంలో ఉన్న దీనానాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో చికిత్స చేసుకునేందుకు నిర్ణయించుకున్నాడు. 

అక్కడికి వెళ్లాలంటే అంబులెన్స్ అవసరం ఉంటుందని ఓ అంబులెన్స్‌ను సంప్రదించాడు. ఆసుపత్రికి వెళ్లాలంటే అతను ఉన్న చోటి నుంచి 7 కిమీల దూరం వెళ్లాలి. అంబులెన్స్‌లో ఆసుపత్రికి చేరుకున్నాక అంబులెన్స్ నిర్వాహకుడు రూ.8 వేలు అడిగాడు. 1 కి.మీకి రూ. 1,142 చొప్పున ఇవ్వాలని లెక్క కూడా చెప్పాడు. దీంతో అతను జేబులు తడుముకున్నాడు. అంబులెన్స్‌కే ఇంత చెల్లించుకుంటే.. ఇక ఆసుపత్రిలో ఇంకెత చెల్లించుకోవాలోనని ఆందోళన చెందాడు. తప్పదన్నట్టు అతను అడిగినంత చెల్లించుకున్నాడు. అయితే అతను   ఇంత పెద్ద మొత్తంలో బాధితుడి నుంచి డబ్బు వసూలు చేయండంపై అంబులెన్స్ నిర్వహకుడిపై జిల్లా అధికారులు.. విపత్తు నిర్వహణ చట్టం, మోటార్ వాహనాల చట్టం కింద కేసు నమోదు చేశారు.   కరోనా సోకిందని తెలిసి కూడా.. కేవలం 7 కి.మీ.ల దూరంలో ఉన్న ఆసుపత్రికి తరలించడానికి అతను తీసుకున్న రూ. 8000లపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.