Pune army hospital transplanted the brain dead jawan's heart to another jawan's wife
mictv telugu

చనిపోతూ తోటి జవాన్ భార్యను కాపాడిన సైనికుడు

February 15, 2023

Pune army hospital transplanted the brain dead jawan's heart to another jawan's wife

సరిహద్దుల్లో దేశానికి రక్షణగా ఉంటూ కాపలా కాసిన ఓ సైనికుడు చనిపోయిన తర్వాత కూడా మరో దేహానికి ప్రాణం పోశాడు. తోటి జవాన్ భార్య అనారోగ్యంతో బాధపడుతుండగా, చనిపోయిన సైనికుడి గుండెను అమర్చి నిండు ప్రాణాన్ని కాపాడారు. వివరాల్లోకెళితే.. మధ్యప్రదేశ్‌లోని భింద్ ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల ఆర్మీ జవాన్ స్వస్థలానికి వస్తూ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. మంచి చికిత్స కోసం ఢిల్లీకి తరలించగా, అక్కడ్ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అయితే ఆయన కుటుంబీకులు అవయవదానానికి ముందుకు రావడంతో వైద్యులు ఆయన గుండెను సేకరించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో పుణెలోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు.

అక్కడ ఓ సైనికుడి భార్య ప్రాణాపాయ స్థితిలో ఉండగా, జవాను గుండెను ఆమెకు విజయవంతంగా అమర్చారు. గుండెను తరలించేందుకు భారత వైమానిక దళం పుణె ట్రాఫిక్ పోలీసుల సాయంతో గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి కేవలం 4 గంటల్లో ఢిల్లీ నుంచి పుణెకు గుండెను తరలించారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆర్మీ సదరన్ కమాండ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కాగా, జనవరి 30న పుణె ఆర్మీ ఆస్పత్రిలో 53 ఏళ్ల జవానుకు గుండె మార్పిడి చేశారు. ఇండోర్‌కి చెందిన 34 ఏళ్ల వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ కావడంతో అతని గుండెను జవానకు అమర్చారు. ఇలా వారాల వ్యవధిలో రెండు సార్లు గుండె మార్పిడి చేసిన ఘనతను ఆర్మీ ఆస్పత్రి దక్కించుకుంది.