సీఎం కాన్వాయ్‌ను ఆపేసి అంబులెన్స్‌కు దారి..
నేతల కాన్వాయ్ వస్తోందంటే ట్రాఫిక్‌ను ఎక్కడికక్కడ కట్టడి చేస్తారు. దీంతో చాలామంది ప్రయాణికులు ఎండకు, వానకు, చలికి తట్టుకుని నిలబడాల్సి వస్తుంది. ట్రాఫిక్ కూడా బాగా జామ్ అయిపోతుంది. అయితే ఇది అన్నీ సందర్భాలలో కుదరదు. కొన్ని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కాన్వాయ్ అయినా నిలపక తప్పదు. అలాంటి ఘటన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఎదురైంది. గుండె మార్పిడి ఆపరేషన్ కోసం తరలిన అంబులెన్స్‌కు దారిఇచ్చేందుకు ఏకంగా తన కాన్వాయ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. ఇందుకు పూనుకున్న పూణే ట్రాఫిక్ పోలీసులను సీఎం అభినందించారు.
పూణే రుబీ హాల్ క్లినిక్‌లో శుక్రవారం సాయంత్రం జరగాల్సిన ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం సోలాపూర్‌కు చెందిన ఓ ఆస్పత్రి నుంచి చార్టర్డ్ విమానంలో దాత గుండెను తీసుకువస్తున్నారు. పూణేలోని లోహెగావ్ విమానాశ్రయానికి చేరుకున్నాక వెంటనే రూబీ హాల్ ఆస్పత్రికి తరలించాలి. సరిగ్గా సాయంత్రం 5.45 గంటలకు గుండెను గ్రీన్ కారిడార్‌పైకి తీసుకురాగా, అదే సమయంలో సీఎం కాన్వాయ్ ఎయిర్‌పోర్ట్ నుంచి నగరంలోకి వెళుతోంది. సీఎం కాన్వాయ్‌ను తక్షణమే ఆపాలని, గ్రీన్ కారిడార్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని తాము కోరామని అధికారులు తెలిపారు. దీంతో సీఎం కాన్వాయ్ ఆపాల్సివచ్చింది. పూణే ట్రాఫిక్ పోలీసులు చర్యను ప్రశంసిస్తూ దేవేంద్ర ఫడ్నవీస్ ట్వీట్ చేశారు. రోగి సకాలంలో గుండె మార్పిడి చికిత్సను పొంది సత్వరమే కోలుకోవాలని ఆయన కోరుకున్నారు. ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు గ్రీన్ కారిడార్‌ను రూపొందించిన పుణే పోలీసులు ఇలా వేగంగా అవయవాలను సంబంధిత ఆస్పత్రికి చేర్చడం ఇది వందో సారి కావడం గమనార్హం.