చిన్న ఉపాయంతో పని మనిషి కష్టాలు తీర్చిన యజమాని - MicTv.in - Telugu News
mictv telugu

చిన్న ఉపాయంతో పని మనిషి కష్టాలు తీర్చిన యజమాని

November 8, 2019

ఇంటి పని మనిషికి కష్టం వస్తే పట్టించుకునే వాళ్లు చాలా తక్కువ. ప్రస్తుతం ఉన్న బిజీ జీవితంలో ఒకరి కష్టం గురించి మరొకరు ఆలోచించే పరిస్థితే లేదు. కానీ ఓ మహిళ తన ఇంట్లో పనిచేసే వంట మనిషి కోసం అద్భుతమైన ఆలోచన చేసింది. ఆమె ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు చేసిన పోస్టు ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆమె చేసిన ఆలోచనను ఇప్పుడు అంతా ప్రశంసిస్తున్నారు. 

పూణేకు చెందిన ధనశ్రీ షిండే అనే బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌ వద్ద గీతా కాలే అనే మహిళ పనికి కుదిరింది. నాలుగు ఇళ్లలో పని చేసుకుంటూ గీతా తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేది. అయితే ఎప్పుడూ చలాకీగా పనిచేసే గీత ఓ రోజు ధీనంగా కనిపించింది. అది గమనించిన ధనశ్రీ ఏం జరిగిందని ఆరా తీసింది. తాను పనిచేసే ఇంట్లో తనను ఉద్యోగం నుంచి తీసేశారని ధీనంగా చెప్పింది. నెలకు రూ. 4000 ఆదాయం పోయిందని ఇప్పుడు తన కుటుంబం పోషణ కష్టంగా మారుతుందని వాపోయింది. 

Business card.

ఆమె మాటలకు వెంటనే ఓ ఉపాయాన్ని ఆలోచించింది ధనశ్రీ. వెంటనే ఓ బిజినెస్ కార్డును రెడీ చేయించింది. దాంట్లో ‘అంట్లు తోమడానికి నెలకు రూ. 800, ఇల్లు ఊడ్వటానికి రూ. 800, బట్టలు ఉతకడానికి రూ. 800, రొట్టెలు చేసేందుకు రూ.1000’ అంటూ పోస్టు పెట్టి కావాల్సిన వారు సంప్రధించాలని ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. దాన్నిఅస్మితా జవదేవకర్‌ అనే నెటిజన్‌ షేర్ చేయడంతో చాలా మంది ఫోన్లు చేయడం ప్రారంభించారు. అప్పుడు తాను పని కోల్పోయానని బాధపడుతున్న గీతా కాలేకు చాలా సులువుగా మళ్లీ పని దొరికింది. తనకు మరో నాలుగు చోట్ల పని రావడంతో సంబరపడిపోతోంది. పని మనిషి కోసం ధనశ్రీ చేసిన ఆలోచన సూపర్ ఉందంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.