Pune: Man annoyed with parrot’s whistling files complaint against his neighbour
mictv telugu

ఈలలతో చంపుతున్న చిలక.. కేసు నమోదు..

August 8, 2022

చాలా మంది చిలుక పలుకులు వినేందుకు ఇష్టపడుతుంటారు. కానీ అతనికి మాత్రం అవే పలుకులు చిరాకు తెప్పించాయి. పొరుగింటి వ్యక్తి పెంచుకుంటున్న చిలుక తనను ఇబ్బంది పెడుతోందని మహారాష్ట్రలో ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చిలక వల్ల తనకు తెగ ఇబ్బంది కలుగుతోందని, దాని అరుపులు, కీచులాటతో తనకు నిద్ర లేకుండా చేస్తోందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మహారాష్ట్ర పుణె నగరంలోని శివాజీ నగర్ ప్రాంతంలో సురేశ్ శిందే అనే 72 ఏళ్ల వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఆయన పక్కింట్లో ఉంటున్న అక్బర్ అంజద్ ఖాన్.. ఓ రామచిలుకను పెంచుకుంటున్నాడు. అయితే చిలుక ఎప్పుడూ అరుస్తూనే ఉందని, అది తనకు చిరాకు తెప్పిస్తున్నట్లు సురేశ్ శిందే.. ఖడ్కే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిబంధనల ప్రకారం దర్యాప్తు చేపడతామని తెలిపారు.

పెంపుడు చిలుక ఈలలు వేస్తుండడంతో సురేష్ ఆ పక్షిని వేరే చోట పెట్టమని దాని యజమాని అక్బర్ అంజద్ ఖాన్‌ను కోరినట్లు పోలీసులు చెప్పారు. అయితే పక్షిని వేరే చోట తరలించమని కోరడంతో అక్బర్.. సురేష్ ని దుర్భాషలాడాడని తెలిపారు. చివరకు చిలుక ఈలలతో విసిగిపోయిన శిందే, పెంపుడు జంతువు యజమానిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడని పేర్కొన్నారు. సంబంధిత చట్టాలకు అనుగుణంగా.. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.