కొన్ని పాఠశాలల, కళాశాలల పేర్లలో కులం పేరు ఉండడం మామూలే. ముఖ్యంగా కుల సంఘాలు నడిపే విద్యాసంస్థల్లో ఇది కామన్. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశమంతా ఈ సంప్రదాయం ఉంది. కొన్నిచోట్ల ప్రభుత్వాలు నడిపే స్కూళ్లకూ విరాళాలు వంటి ఏవో కారణాల వల్ల కులం పేర్లు ఉన్నాయి. ఇలాంటి కులాల, వర్గాల పేర్ల వల్ల సమానత్వ విలువలు దెబ్బతింటాయని పంజాబ్లోని ఆప్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
కులం పేరున్న స్కూళ్ల పేర్లను మార్చేసింది. రాష్ట్రంలోని 56 ప్రభుత్వ పాఠశాలల పేర్లు మార్చినట్లు అధికారులు వెల్లడించారు. వాటికి ఆయా గ్రామాల, స్థానిక అమరవీరుల, ప్రముఖలు పేర్లు పెట్టినట్లు తెలిపారు. విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ ఆదేశించిన తర్వాత వారం రోజుల్లో ఈ మార్పు చేశామన్నారు. ‘‘స్కూళ్లకు కులం, వర్గం పేర్లు ఉంటుంది కులవివక్షకు అవకాశముంటుంది. తాము ఇంకా అనాగరికులమని భావన విద్యార్థుల్లో ఉంటుంది. అందుకే నిర్ణయం తీసుకున్నాం’’ అని హర్జోత్ చెప్పారు.