ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో పంజాబ్ ఆప్ సీఎం భగవంత్ మాన్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన ఆయన బీజేపీని హెచ్చరిస్తూ చురకలంటించారు. సమయం అన్నీ నేర్పుతుందని రాజులు కూడా అడుక్కుతినే రోజు వస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీది లోకతంత్రం కాదు లూటీ తంత్రమని మండిపడ్డారు.
ఎమ్మెల్యేలను కొనడం, ఉప ఎన్నికల్లో గెలవడం ఆ పార్టీకి అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. ‘రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన మాటలు అబద్ధాలుగా మిగిలిపోయాయి. ప్రతీ ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తామనే హామీ కూడా దాంట్లో కలిసిపోయింది. ప్రతీ ఆగస్టుకి ఢిల్లీ నుంచి ఇచ్చే ప్రసంగం ఎప్పుడూ ఒకేమాదిరిగా ఉంటోంది.
చివర్లో ఉగ్రదాడులపై విచారం వ్యక్తం చేస్తూ ప్రసంగాన్ని ముగించుకుంటూ వస్తున్నారు. ముందు దాన్ని మార్చండి. నిరుద్యోగం, పేదరికం, అభివృద్ధి వంటి వాటిపై మాట్లాడండి. ఇవికాకుండా రైల్వేలు, ఎల్ఐసీ, ఎయిర్ పోర్టులను అమ్మడమే పనిగా పెట్టుకున్నారు. మీడియాను కొనుగోలు చేసి విపక్షాలు ఉన్న రాష్ట్రాలను గెలుచుకోవాలని చూస్తున్నారు. మంచి పనులు చూసి నేర్చుకోవాలి. ఇవి నాలెడ్జ్ షేరింగ్ రోజులు. పంజాబ్‌లోనూ తెలంగాణ పథకాలు ప్రవేశపెడతాము.
తెలంగాణ కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిది. దేశంలో మంచి మనసు ఉన్న నతలు లేకుండా పోయారు. అలాంటి వారుంటే దేశం సస్యశ్యామలం అయ్యేది. కేజ్రీవాల్ స్కూళ్లపై విమర్శించారు. కానీ ట్రంప్ భార్య వస్తే కేజ్రీవాల్ ఢిల్లీలోని స్కూల్ చూపించార’ని ప్రసంగించారు. చివర్లో జిందా రహేతో మిలేంగే.. మిల్తే రహేతో జిందా రహేంగే అని పిలుపునిచ్చారు.