తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని మంగళవారం పంజాబ్ ఆప్ సీఎం భగవంత మాన్ కలిశారు. హైదరాబాద్ వచ్చిన ఆయనను కేసీఆర్ ప్రగతిభవన్ లోకి సాదరంగా ఆహ్వానించి శాలువా కప్పి వీణ బహుకరించారు. భగవంత మాన్ కూడా శాలువా కప్పి ఓ కానుక అందజేశారు. అనంతరం జరిగిన భేటీలో ఇద్దరు ముఖ్యమంత్రులు జాతీయ రాజకీయాలపై చర్చించినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారడం, ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం కావడం, పార్టీ కార్యాచరణ వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. కేసీఆర్ కూడా పంజాబ్ లోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ఇప్పటికే కర్ణాటకలో జేడీఎస్ తో పొత్తు పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించిన కేసీఆర్.. కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్ పార్టీతో కలిసి కొన్ని రాష్ట్రాల్లో పోటీ చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆ పార్టీ నేతలతో వరుస మీటింగులు నిర్వహిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ రోజు పంజాబ్ సీఎం రాగా, 24వ తేదీన పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ సర్దార్ కుల్తార్ సింగ్ సంధ్వాన్, డిప్యూటీ స్పీకర్ జైకిషన్ సింగ్ రౌరీ తదితరులు కేసీఆర్ తో భేటీ కోసం హైదరాబాద్ రానున్నారు. దీంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది.