లక్ష కోట్ల సహాయం అడిగిన కొత్త సీఎం - MicTv.in - Telugu News
mictv telugu

లక్ష కోట్ల సహాయం అడిగిన కొత్త సీఎం

March 24, 2022

gddg

ఇటీవలి ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పరచిన పంజాబ్ ఆప్ సీఎం భగవంత్ మాన్ గురువారం ప్రధాని నరేంద్ర మోదీని తొలిసారి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అనేక విషయాలు చర్చకు వచ్చినట్టు ఆయన తెలిపారు. దాదాపు 20 నిమిషాలు సాగిన ఈ భేటీ అనంతరం భగవంత్ మాన్ మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘ దేశ రక్షణ విషయంలో పంజాబ్ ప్రభుత్వానికి కేంద్ర మద్ధతు కావాలని కోరాను. శత్రు దేశాలు పంజాబ్ అస్థిత్వం మీద దెబ్బకొట్టడానికి డ్రగ్స్‌ను పెద్ద ఎత్తున రాష్ట్రంలో సరఫరా చేస్తున్నాయి. దీన్ని అరికట్టడంలో సహాయాన్ని కోరా. గత ప్రభుత్వాల కాలంలో దళారులు పంజాబ్‌ను దోచుకున్నారు. దాంతో రాష్ట్ర అప్పు రూ. 3 లక్షల కోట్లకు చేరింది. మేము మా కాళ్ల మీద నిలబడాలంటే కేంద్రం తరపున ఏడాదికి 50 వేల కోట్ల చొప్పున రెండేళ్లపాటు ప్రత్యేక గ్రాంటు మంజూరు చేయాలని అభ్యర్థించాను. దేశ నిర్మాణంలో పంజాబ్ పోషించిన పాత్రను ప్రధానికి గుర్తు చేశా. గ్రాంటు విషయంలో ఆర్థిక మంత్రితో ప్రధాని మాట్లాడతారని ఆశిస్తున్నా’నని వెల్లడించారు. కాగా, దేశ భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రతీ చర్యకు కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని చెప్పినట్టు భగవంత్ మాన్ వివరించారు.