Punjab CM visits Kondapochamma Sagar, officials brief over project
mictv telugu

కొండపోచమ్మ సాగర్‌ను పరిశీలించిన పంజాబ్ సీఎం

February 16, 2023

Punjab CM visits Kondapochamma Sagar, officials brief over project

పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ నేడు సిద్ధిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన.. గురువారం జిల్లాలోని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలతో పాటు నీటి పారుదల ప్రాజెక్టులను పరిశీలిస్తున్నారు. ఈ మధ్యాహ్నం గజ్వేల్‌ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్‌ను పరిశీలించారు. ప్రాజెక్టు వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. కాళేశ్వరం నుంచి 618 మీటర్ల ఎత్తులో కొండపోచమ్మ సాగర్ ఉన్నదని, 15 టీఎంసీల సామర్థ్యంతో ఈ రిజర్వాయర్‌ను ప్రభుత్వం నిర్మించిందని తెలిపారు. ఇది 2,85,280 ఎకరాలకు సాగునీరు అందిస్తుందని వివరించారు.

అనంతరం మాన్ గజ్వేల్ చేరుకుని పాండవుల చెరువు కట్టపై ఏర్పాటు చేసిన మినీ ట్యాంక్ బండ్లను, చెరువులో నీటి నిల్వ తదితర అంశాలను పరిశీలించారు. పాండవుల చెరువు వద్ద స్థానిక మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్‌లతో పాటు ప్రజా ప్రతినిధులు అధికారులు స్వాగతం పలికారు. పాండవుల చెరువు పునరుద్ధరణ నీటి నిలువ పెరిగిన మత్స్య సంపద ఇతర అంశాలపై అధికారులు పంజాబ్ సీఎంకు వివరించారు.

ఎర్రవెల్లి వద్ద చెక్ డ్యామ్ లను కూడా భగవంత్ సింగ్ మాన్ పరిశీలించనున్నారు. మిషన్ కాకతీయ పథకం కింద చేపట్టిన పాండవుల చెరువును కూడా భగవంత్ సింగ్ మాన్ పరిశీలిస్తారని అధికారులు తెలిపారు. అనంతరం కొండపోచమ్మ సాగర్‌ పంప్‌ హౌస్‌ను, తొగుటలోని మల్లన్నసాగర్‌ ప్రాజెక్టును సీఎం భగవంత్‌సింగ్‌ మాన్‌ సందర్శించనున్నారు.