పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం.. వీఐపీలకు సెక్యూరిటీ కట్ - MicTv.in - Telugu News
mictv telugu

పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం.. వీఐపీలకు సెక్యూరిటీ కట్

May 28, 2022

పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే లంచం తీసుకున్నారనే ఆరోపణలు రావడంతో తన క్యాబినెట్‌లోని మంత్రినే తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రంలోని 424 మంది ప్రముఖులకు ప్రభుత్వం కల్పించిన భద్రతను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. వారిలో పదవీ విరమణ పొందిన పోలీసులు, మత నాయకులు, రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు. కాగా, ఏప్రిల్‌ నెలలో పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు సహా 184 మందికి భద్రతను ప్రభుత్వం ఉపసంహరించుకున్నది. వీరిలో పంజాబ్‌ మాజీ సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, అమరిందర్‌ సింగ్‌ కుమారుడు, అతని భార్య, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రతాప్‌ సింగ్‌ బజ్వావర్‌ కూడా ఉన్నారు. ఈ నిర్ణయంతో 400 మందికి పైగా పోలీసు సిబ్బంది తిరిగి పోలీసు స్టేషన్లకు వచ్చినట్లు సీఎం తెలిపారు. పోలీసులు సామాన్య ప్రజల కోసం పని చేయాలి గానీ.. వీఐపీలకు భద్రతా విధుల పేరుతో వారిని బాధపెట్టకూడదని తమ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు మాన్‌ వెల్లడించారు.