మీ ఇంట్లో పెళ్లవుతోందా…?శుభకార్యం ఏదైనా ఉందా..?అయితే ఒక్క ఫోన్ చేయండి చాలు మీ ఇంట్లో బ్యాండ్ బజాయించేందుకు మేము వాలిపోతామంటున్నారు పంజాబ్ పోలీసులు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు, ఇలా డప్పులు వాయిస్తామని అంటారేంటని ఆశ్చర్యపోతున్నారా.? అవును మీరు విన్నది నూటికి నూరు శాతం నిజమే. శుభకార్యాలకు, వివాహాలకు లేదా మరే కార్యక్రమానికి అయినా సరే పోలీసులే వచ్చి బ్యాండ్ వాయించే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది పంజాబ్ జిల్లాలోని ముక్త్సార్ పోలీసులు.
సాధారణంగా గణతంత్ర, స్వాతంత్ర్య వేడుకల్లో పోలీసులు బ్యాండ్ వాయిస్తుంటారు. అయితే ఇకపై పెళ్లిళ్లకు, పంక్షన్లకు కూడా బ్యాండ్ వాయించే వినూత్న కార్యక్రమానికి పంజాబ్ పోలీస్ శాఖ శ్రీకారం చుట్టింది. పోలీసు బ్యాండ్ టీమ్ సేవలను ప్రజలు ఉపయోగించుకునేందుకు ఓ మొబైల్ నంబర్‌ను ఏర్పాటు చేసింది పోలీస్ శాఖ. ఈ నెంబర్‌కు కాల్ చేసి పోలీస్ బ్యాండ్‌ను బుక్ చేసుకోవాలని ప్రకటన కూడా చేసింది. కొత్తగా సర్కులర్ కూడా విడుదల చేశారు పోలీసు అధికారులు.
మీ ఇంటి వేడుకల్లో పోలీసు బ్యాండ్ కావాలంటే మాత్రం గంటకు రూ.5000 వేలు చెల్లించాల్సిందే. సమయం దాటిపోతే అదనపు ఛార్జీలను వసూలు చేస్తారు పోలీసులు. ఇందులోనూ ప్రభుత్వ ఉద్యోగులకు కొంత వెసులుబాటును కల్పించింది పోలీస్ శాఖ. ప్రభుత్వ ఉద్యోగులు నిర్ణీత సమయం దాటితే రూ.2500 అదనంగా చెల్లిస్తే చాలు. అదే సామాన్యులైతే రూ.3500 చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాదు పోలీసు బృందం రవాణా ఖర్చులను భరించాల్సి ఉంటుందని సర్కులర్లో పేర్కొన్నారు.
అయితే పంజాబ్ పోలీస్ శాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆప్ సర్కార్‌ను ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. రాష్ట్రానికి నిధులను సమకూర్చుకోవడానికి పోలీసు శాఖ ఇలా బ్యాండు వాయిస్తుందా అంటూ శిరోమణి అకాలీదళ్ ఎంపి సుఖ్ బీర్ బాదర్ ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు. అయితే ఈ బ్యాండ్ స్క్యులర్పై డీసీపీ స్పందించారు. పెళ్లి లేదా ఇతర శుభకార్యాల్లో పోలీసులు బ్యాండ్ వాయించడం ఎంతమాత్రం తప్పుకాదన్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఈ విధానంలో పోలీసులు బ్యాండ్ వాయిస్తున్నారని తెలిపారు.