కొన్ని రోజుల క్రితం వరకు కురిసిన వర్షాలకు హైదరాబాద్ నగరం చిగురుటాకులా వణికింది. భారీ వర్షాలకు మూసి నది పొంగి పొర్లింది. దీంతో ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. తాజాగా మూసీ నది వరద ఉధృతిని తట్టుకోలేక పూరానాపూల్‌లో వంతెనకు పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు ముందు జాగ్రత్తగా వంతెన నుంచి రాకపోకలు నిలిపివేశారు. మూసీకి వరద కారణంగా పూరానాపూల్ వంతెనకు పగుళ్లు ఏర్పడ్డాయని తెలుస్తోంది.
కార్వాన్, జియాగూడ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను పూరానాపూల్ నుంచి అఫ్జల్‌గంజ్ వైపు మళ్లిస్తున్నారు. వంతెన పరిస్థితిని అంచనా వేసేందుకు సాంకేతిక నిపుణులను రంగంలోకి దించుతున్నారు. ఈ సందర్భంగా మూసీ రివర్ బోర్డు ఛైర్మెన్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా మూసికి ఇరువైపులా పటిష్టమైన రెయిలింగ్ ఏర్పాటు చేయాలని తెెలంగాణ ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. ప్రస్తుతం ఉప్పొంగుతున్న మూసీ నదిని డ్రోన్ కెమెరాలతో చిత్రీకరిస్తున్నామని తెలిపారు.