బిచ్చగాడిగా మారిన ఇంజనీర్.. ఎందుకంటే - MicTv.in - Telugu News
mictv telugu

బిచ్చగాడిగా మారిన ఇంజనీర్.. ఎందుకంటే

January 19, 2020

Engineer.

తల్లి మాట కోసం బిచ్చం ఎత్తుకుంటాడు. కానీ, అతను బిచ్చగాడు కాదు కోటీశ్వరుడు అని చివరగా తెలుస్తుంది. ఇది బిచ్చగాడు సినిమా కథ. ఈ కథలో మాత్రం బిచ్చగాడు ఉన్నత విద్యావంతుడు. ఇంజనీరింగ్ చదువుకున్నాడు. ఆ విషయం తెలియక అతను బిచ్చగాడే అనుకున్నాడో రిక్షావాడు. తర్వాత అతను ఇంజనీర్ అని తెలిసి షాక్ అయ్యాడు. ఓ బిచ్చగాడు, కిక్షావాడు తీవ్రంగా గొడవపడ్డారు. పోలీసులు వచ్చి కల్పించుకోగా వారిద్దరిలో ఒకతను ఉన్నత చదువులు చదువుకున్న ఇంజనీర్ అని తెలిసి అటు పోలీసులు, ఇటు అతనితో పోట్లాడిన రిక్షావాడు ఆశ్చర్యపోయారు? ఈ ఘటన పూరిలోని జగన్నాథ ఆలయం వద్ద చోటు చేసుకుంది. 

ఆలయం వద్ద సుమారు 51 ఏళ్ల వయసున్న బిచ్చగానికి , రిక్షావాడికి చిన్నపాటి గొడవ జరిగింది. చిలికి చిలికి గాలివానలా వారి గొడవ పెద్దదైంది. ఇద్దరూ రక్తాలు కారేలా కొట్టుకున్నారు. ఆ రోడ్డు మీద వెళ్లేవారిలో వారిని విడిపించడానికి ఏ ఒక్కరూ ప్రయత్నించలేదు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇద్దరినీ చెదరగొట్టారు. పోలీస్ స్టేషన్‌కు తరలించి ఇద్దరి మధ్య గొడవకు గల కారణాలను తెలుపుతూ ఫిర్యాదు రాయమన్నారు. రిక్షావాడు రాయలేక రాశాడు.. తర్వాత బిచ్చగాడు రాశాడు. ఆంగ్లంలో ఒక్క అక్షరం కూడా తప్పు పోకుండా ఫిర్యాదు రాశాడు. అతని రాతను చూసి రిక్షావాడు, పోలీసులు ఆశ్చర్యంతో నోళ్లు వెళ్లబెట్టారు. 

పోలీసులకు అనుమానం కలిగి అతన్ని విచారించారు. అప్పుడు చెప్పాడు అతడు తన పేరు గిరిజా శంకర్ మిశ్రా అని. తనది ఒడిశాలోని భువనేశ్వర్ అని చెప్పాడు. శంకర్ తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. అనాథ ఆశ్రమంలో పెరగుతూ శంకర్ కష్టపడి బీఎస్సీ గ్రూప్‌లో డిగ్రీ చదివాడు. ఆ తర్వాత ముంబయి వెళ్లి కొన్ని రోజులు ఉద్యోగం చేశాడు. అనంతరం సీపెట్‌ నుంచి ప్లాస్టిక్‌ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేసి హైదరాబాద్‌లోని మిల్టన్‌ అనే కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేశాడు. తర్వాత అక్కడినుంచి  చేస్తున్న ఉద్యోగాన్ని, హైదరాబాద్‌ను వదిలి ఒడిశాలోని పూరికి తిరిగి వచ్చి జగన్నాథ ఆలయం దగ్గర బిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నాడు.

ఎందుకిలా బిచ్చగాడి అవతారం ఎత్తావ్ అని అడిగితే.. ఈ విషయం గురించి నేను ఏమి మాట్లాడలేను అని సమాధానం చెప్పాడు. నేను బిచ్చగాడిగా మారడానికి నాకు కొన్ని సొంత కారణాలు ఉన్నాయని తెలిపాడు. తాను ఇంజనీర్‌గా పని చేసిన మాట నిజమే.. కానీ  సుపీరియర్‌ ఆఫీసర్లతో విభేదాలు వచ్చి అక్కడి నుంచి బయటకు వచ్చి ఇలా బిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నానని తెలిపాడు. తమ గొడవపై ఎలాంటి కేసు నమోదు చేయొద్దని శంకర్ పోలీసులను అభ్యర్థించాడు. దీంతో పోలీసులు అంగీకరించి ఇద్దరిని వదిలిపెట్టారు. కాగా, శంకర్ తన ఉద్యోగాన్ని వదిలేసి బిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నా రోజు రాత్రిళ్లు మాత్రం వీధి దీపాల కింద వార్తా పత్రికలను క్రమం తప్పకుండా చదువుతాడని స్థానికులు తెలిపారు.