‘ఇస్మార్ట్ శంకర్’ టీజర్ విడుదల.. రచ్చ రచ్చే.. - MicTv.in - Telugu News
mictv telugu

‘ఇస్మార్ట్ శంకర్’ టీజర్ విడుదల.. రచ్చ రచ్చే..

May 15, 2019

ప్రతి సినిమాలో తన మార్క్ చూపిస్తుంటాడు డైరెక్టర్ పూరి జగన్నాథ్. తాజాగా ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. పూరి సినిమా అనగానే అందర్లో భారీ అంచనాలు హీరో పాత్ర మీదే ఉంటాయి. కథనాయకుడి పాత్రను చిత్రంగా చూపించడంలో పూరి దిట్ట. అందుకే పూరితో సినిమా చేయాలని చాలా మంది హీరోలు కోరుకుంటారు.

పూరి ‘ఇస్మార్ట్ శంకర్’‌లో ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరో‌గా నటిస్తున్నాడు. బుధవారం రామ్ పుట్టిన రోజు సందర్భంగా సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. ‘పతా హై మై కౌన్‌ హూ.. శంకర్‌.. ఉస్తాద్‌ ఇస్మార్ట్‌ శంకర్‌’ అని రామ్‌ స్టైల్‌గా తన పేరుని చెప్తున్న సన్నివేశంతో మొదలైన టీజర్.. డ్యాన్స్‌, ఫైటింగ్‌ సన్నివేశాల్లో రామ్‌ చాలా స్టైలిష్‌గా కనిపించాడు. ‘నాతో కిరికిరి అంటే పోచమ్మ గుడి ముంగట పొట్టేలుని కట్టేసినట్లే..’ అని చివర్లో చెబుతున్న డైలాగ్‌ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఈ సినిమాలో రామ్ సరసన నిధి అగర్వాల్‌, నభా నటేశ్‌ హిరోయిన్లుగా నటిస్తున్నారు. పూరి కనెక్ట్స్‌ బ్యానర్‌పై పూరి జగన్నాథ్‌, హీరోయిన్ ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం గోవాలో చిత్రీకరణ జరుగుతోంది. రామ్‌, నభాలపై ఓ పాటను తెరకెక్కిస్తున్నారు. మరో మూడు పాటల షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.