ఇస్మార్ట్‌ పిల్లి.. సెల్ఫీలతో రచ్చ - MicTv.in - Telugu News
mictv telugu

ఇస్మార్ట్‌ పిల్లి.. సెల్ఫీలతో రచ్చ

September 27, 2020

స్మార్ట్‌ఫోన్‌కు బానిస కానివారు ఎవరు చెప్పండి? పెద్దవాళ్లు కూడా స్మార్ట్‌ఫోన్ వాడటానికి అప్‌డేట్ అయి స్మార్టుగా ఆపరేట్ చేస్తున్నారు. గ్రామాల్లో కూడా స్మార్ట్‌ఫోన్ వినియోగం బాగా పెరిగిపోయింది. ‘మనుషులు అందరూ అప్‌డేట్ అవుతుంటే మాకేం పాడురోగం? మేము కూడా అప్‌డేట్ అవాల్సిందే. స్మార్ట్‌ఫోన్‌తో సెల్ఫీలు దిగాల్సిందే’ అని అనుకున్నట్టుంది ఓ పిల్లి. అనుకున్నదే తడవుగా టాబ్లెట్ తీసుకుని టకటకా అని సెల్ఫీలు దిగి పారేసింది. ఇంటికి వచ్చిన యజమానురాలు ట్యాబ్లెట్ మీద పిల్లి వెంట్రుకలను చూసి షాక్ అయింది. ఓపెన్ చేసి చూస్తే పిల్లి సెల్ఫీలు దర్శనం ఇచ్చాయి. వాటిని చూసి ఆమె మరింత షాక్ అయింది. 

బీజింగ్‌లో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఆ ఫోటోలను ఆమె తన సోషల్‌ మీడియాలో ఖాతాలో షేర్‌ చేసింది. తన పెంపుడు పిల్లి ఎర్‌నియు సెల్పీలు తీసుకోవడం నేర్చుకుందని పేర్కొంది. ఫ్లాష్‌లైట్‌ను కూడా ఉపయోగిస్తోందని వెల్లడించింది. దీంతో పిల్లి ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫోటోలకు భారీ స్పందన వస్తోంది. ఇది స్మార్ట్‌ పిల్లి అంటూ నెటిజన్లు  కామెంట్లు చేస్తున్నారు.