పట్టుబడ్డ ‘పుష్ప’ గ్యాంగ్.. చొక్కాలపై అల్లు అర్జున్ ఫోటోలు - MicTv.in - Telugu News
mictv telugu

పట్టుబడ్డ ‘పుష్ప’ గ్యాంగ్.. చొక్కాలపై అల్లు అర్జున్ ఫోటోలు

July 6, 2022

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప చిత్రం పాన్ ఇండియా స్థాయిలో హిట్ అవడం తెలిసిందే. సినిమాలో హీరో తన తెలివితో రకరకాలుగా ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తుంటాడు. ఇప్పుడు ఆ సినిమాలోని సన్నివేశాలను స్పూర్తిగా తీసుకొని స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను గుజరాత్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల చొక్కాలపై అల్లు అర్జున్ ఫోటోలు ఉండడం గమనార్హం. వివరాల్లోకెళితే.. రైతులకు లాభదాయకంగా ఉంటుందని అక్కడి ప్రభుత్వం ఎర్రచందనం మొక్కలను పెంచుకోవడానికి అనుమతినిచ్చింది. దాంతో పొలాల్లో, ఇంటి పరిసరాల్లో చాలా మంది ఎర్రచందనం చెట్లను నాటుకున్నారు. వీటికి అత్యధిక ధర ఉండడంతో యూపీకి చెందిన ఓ ముఠా కన్ను చెట్లపై పడింది. గుడారాలు వేసుకొని పగలంతా దువ్వెనలు, పిన్నీసులు అమ్ముకునేవారిలా నటించి ఎక్కడెక్కడ చెట్లు ఉన్నాయో కనిపెట్టేవారు. రాత్రి అవగానే వెళ్లి చెట్లను నరికి ముక్కలు చేసి తామున్న చోట భూమిలో పాతిపెట్టేవారు. తర్వాత అదను చూసి వాటిని యూపీ, మధ్యప్రదేశ్‌లకు తరలించి సొమ్ము చేసుకునేవారు. ఈ క్రమంలో ప్రజల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు రావడంతో స్పందించిన గుజరాత్ పోలీసులు తెలివిగా రోడ్లపై రెక్కీ నిర్వహించారు. ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు వాహనంపై వెళ్తుండగా, అనుమానం వచ్చిన పోలీసులు వారిని ఆపారు. నడుముకు ఎర్రని గుడ్డ కట్టుకొని ఉండడంతో విప్పి చూడగా, చెట్లు నరికే పనిముట్లు బయటపడ్డాయి. వారితో మాట్లాడగా, వారు గుజరాతీ కాకుండా హిందీ మాట్లాడుతుండడంతో అనుమానం బలపడి వారిని స్టేషనుకి తీసుకెళ్లి విచారించారు. విచారణలో వారు నిజం ఒప్పుకోవడంతో కోర్టులో హజరుపరచే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నారు. కాగా, వీరిని యూపీ, మధ్యప్రదేశ్‌లలో పుష్పా గ్యాంగ్ అంటారట. అలాగే వీరు ధరించే చొక్కా మీద పుష్ప సినిమాలోని అల్లుఅర్జున్ పోస్టర్లు ఉన్నాయని పోలీస్ అధికారి విశాల్ వెల్లడించారు.