తాము ఉత్పత్తి చేసే వస్తువుల మార్కెటింగ్ కోసం కంపెనీలు రకరకాలుగా ప్రయత్నిస్తుంటాయి. వినియోగదారులను ఆకట్టుకోవడానికి పలు ఆఫర్లను ప్రకటిస్తాయి. అయితే ఈ అమెరికన్ కంపెనీ మాత్రం వెరైటీ కాన్సెప్ట్‌తో ముందుకొచ్చింది. తాము చెప్పినట్టు వంద బొద్దింకలను ఇంట్లో పెట్టుకుంటే రూ. లక్షన్నర ఇస్తామని ప్రకటించింది. ఆసక్తి ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవాలని సూచించడంతో 2200 వరకు దరఖాస్తులు వచ్చాయంట.
అయితే ఈ ఆఫర్ మన ఇండియాలో కాదు. అమెరికాలో మాత్రమే వర్తిస్తుంది. నార్త్ కరోలినాకు చెందిన ది పెస్ట్ ఇన్ఫార్మర్ అనే సంస్థ ఈ ఆఫర్ ఇవ్వగా, అందుకు కొన్ని కండీషన్లు పెట్టింది. బొద్దింకలను వదిలేందుకు ఇంటి యజమాని రాతపూర్వకంగా ఆమోదించాలి. 30 రోజుల వరకు ఎలాంటి మందులు వాడకూడదు. 21 ఏళ్లు నిండి ఉండాలి. పై నిబంధనలు పాటించిన వారికే డబ్బులిస్తామని కంపెనీ వెల్లడించింది. బొద్దింకల నివారణకు కొత్త పద్ధతులను పరీక్షించేందుకు ఏడు ఇళ్లల్లో బొద్దింకలను వదులుతున్నట్టు కంపెనీ హెడ్ డేవిడ్ ఫ్లాయిడ్ తెలిపాడు. బొద్దింకలను వదిలిన తర్వాత తమ ప్రొడక్టుని ప్రయోగిస్తామని, ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.