రూ.100 లంచం ఇస్తే పరీక్షలో పాస్ చేసేస్తా.. ప్రిన్సిపల్(వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

రూ.100 లంచం ఇస్తే పరీక్షలో పాస్ చేసేస్తా.. ప్రిన్సిపల్(వీడియో)

February 20, 2020

Put Rs 100 In Answer Sheets': UP School Official Advises Students Giving Board Exam, Arrested

‘బాగా కష్టపడి చదవండి. మంచి మార్కులు సాధించి పాస్ అవ్వండి. మీ భవిష్యత్తులో బాగా ఎదగండి’ పాఠశాలలో ఏ ఉపాధ్యాయుడు అయినా ఇదే చెబుతాడు. కానీ, ఈ టీచర్ మాత్రం ఎప్పుడూ రొటీన్ రొడ్డకొట్టుడేనా కాస్త డిఫరెంట్‌గా, విద్యార్థులను చెడగొట్టేలా మాట్లాడేద్దాం అని అనుకున్నట్టున్నాడు. వంద రూపాయలు ఇవ్వండి.. చదవకుండానే చిట్టీలు కొట్టి పాస్ అవ్వండి అని బహిరంగంగా చెబుతున్నాడు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ముందే చాలా ఓపెన్‌గా చెప్పేశాడాయన. పిల్లలను మంచి దారిలో నడిపించాల్సిన బాధ్యతగల సారే ఇలా మాట్లాడేస్తే విద్యార్థుల రేపటి భవిష్యత్తు ఎలా ఉంటుందోనని ఈ వీడియో చూసినవారు కామెంట్లు చేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని మావు జిల్లా హరివంశ్ మెమోరియల్ ఇంటర్ కాలేజీలో ఈ సార్ భాగోతం వెలుగుచూసింది. 

ప్రవీణ్ మాల్ ఆ కాలేజీకి ప్రధానోపాధ్యాయుడు. పిల్లలు, వారి తల్లిదండ్రుల సమక్షంలో ఆయన మాట్లాడుతూ లంచం తీసుకుంటే కష్టపడకుండానే అందలాలు అధిష్టించవచ్చు అని అవినీతి పాఠాలు చెప్పాడు. ఈ వీడియోలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. ‘ఇన్విజిలేటర్లకు ఏమాత్రం భయపడకుండా మీరు చక్కగా పరీక్ష సాంతం రాసేయండి. వాళ్లు మిమ్మల్ని ఏమీ అనరు. ఎందుకంటే వారు నా స్నేహితులే. ఒక్క ప్రశ్న కూడా వదిలిపెట్టకుండా అన్నీ ప్రశ్నలకు జవాబు రాసేయండి. దానితో పాటు జవాబు పత్రంలో వంద రూపాయల నోటు తప్పనిసరిగా పెట్టండి. అందరినీ పాస్ చేయించే బాధ్యత నాది. ఒక మార్కు, రెండు మార్కుల ప్రశ్నలకి విద్యార్థులు తమలో తాము సంప్రదించుకోవచ్చు, మీకు ఎవరూ అడ్డుచెప్పరు. నాదీ పూచీ’ అని విద్యార్థులకు చెప్పాడు. అయితే ఇదంతా అక్కడున్న ఓ విద్యార్థి వీడియో తీసి ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్‌కు ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టడంతో పోలీసులు సదరు ప్రిన్సిపాల్‌ని అరెస్టు చేసి కటకటాల వెనకకు నెట్టారు.