రష్యాలో సైనిక సమీకరణ.. దేశం విడిచి పారిపోతున్న ప్రజలు - MicTv.in - Telugu News
mictv telugu

రష్యాలో సైనిక సమీకరణ.. దేశం విడిచి పారిపోతున్న ప్రజలు

September 22, 2022

ఉక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధంలో కొన్ని కీలక ప్రాంతాల్లో వెనకడుగు వేసిన రష్యా వాటిని స్వాధీనం చేసుకోవడానికి అదనంగా సైన్యాన్ని సమకూర్చుకునే ప్రయత్నాల్లో ఉంది. ఈ మేరకు అధ్యక్షుడు పుతిన్ బుధవారం కీలక ప్రకటన చేశారు. మూడు లక్షల మందితో పాక్షిక సైనిక సమీకరణ చేయనున్నట్టు వెల్లడించారు. దీంతో యుద్ధంలో చేరాల్సి వస్తుందేమోనన్న భయంతో అక్కడి పురుషులు దేశం విడిచి పారిపోతున్నారు. గతంలో ఆర్మీలో కొంతకాలం పనిచేసిన 35 ఏళ్ల లోపు వారిని సైన్యంలో చేరాలంటూ నోటీసులు వస్తున్నాయి.

 

అంతేకాక, ఆరోగ్య పరీక్షలు కూడా చేయించుకోవాలని అందులో పేర్కొన్నారు. దీంతో ఆ వయసు పురుషులు, వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. రష్యాను విడిచి ఎలా వెళ్లాలి? అని గూగుల్ తల్లిని అడుగుతున్నారు. ఈ క్రమంలో రష్యా నుంచి సరిహద్దు దేశాలైన జార్జియా, అజర్ బైజాన్, ఆర్మేనియా, కజకిస్థాన్ వెళ్లే అంతర్జాతీయ విమానాల టిక్కెట్లు క్షణాల్లో బుక్కయ్యాయి. ధరలు కూడా డిమాండుకు తగ్గ రేంజులో పెరిగాయి. ఇదిలా ఉంటే 18 నుంచి 65 ఏళ్ల మధ్యనున్న పురుషులకు విమానయాన సంస్థలు టిక్కెట్ల అమ్మకాలను నిలిపివేసినట్టు స్థానిక మీడియా తెలిపింది. తమపై మార్షల్ లాను ప్రయోగిస్తారనే భయంతో టిక్కెట్ల అమ్మకాలను నిలిపివేసినట్టు పేర్కొంది. కేవలం రక్షణ శాఖ అనుమతి ఉన్న పురుషులకు మాత్రమే విమాన టిక్కెట్లు అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో రష్యా నుంచి విదేశాలకు వెళ్లే విమానాల రద్దీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.