ఆశకు పోయి పరువు తీసుకున్న కొండచిలువ - MicTv.in - Telugu News
mictv telugu

ఆశకు పోయి పరువు తీసుకున్న కొండచిలువ

September 29, 2020

python rescued after it swallows  goat unable to move

మనిషికైనా, పశువుకైనా ఆశకు అంతు ఉండాలి. దురాశ దు:ఖానికి చేటు అని పెద్దలు ఊరికే అనలేదు. కోట్లకు పడగలెత్తాలని అక్రమాలకు పాల్పడేవాళ్లు బండారం బయటపడ్డాక జైళ్లకు వెళ్లి పరువు తీసుకోవడం మనకు తెలిసిందే. ఓ కొండచిలువ కూడా తన తాహతు మించిన తిండికి ఆశపడి పరువు పోగొట్టుకుంది. 

ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లా సిహారి గ్రామానికి ఆదివారం ఓ కొండచిలువ వచ్చింది. కోడి, కప్ప వంటివి తిని బోర్ కొట్టిందేమో, ఏకంగా మాంచి గొర్రెపై కన్నేసింది. దాన్ని చుట్టేసి నోట్లో పెట్టుకుంది. తాపీగా మింగేసింది. తర్వాత అసలు కష్టం మొదలైంది. అటూ ఇటూ కదల్లేక అక్కడే మకాం వేసింది. చచ్చిన దానిలా గంటలపాటు అక్కడే ఉండిపోయింది.  దాని కష్టం చూసి జనం నోళ్లు వెళ్లబెట్టారు. విషయం అటవీ అధికారులకు తెలిసింది. వాళ్లొచ్చి దాన్ని ట్రాక్టర్‌లో వేసుకుని వెళ్లిపోయారు. దాని నోట్లోంచి గొర్రెను బయటికి తీసి వదిలేశారా, లేకపోతే అలాగే పడుకోబెట్టి అడవిలో వదిలేశారా అన్నది తెలియడం లేదు!