పైకప్పులో పదేళ్లుగా కొండ చిలువ.. చివరికి ఇలా  - MicTv.in - Telugu News
mictv telugu

పైకప్పులో పదేళ్లుగా కొండ చిలువ.. చివరికి ఇలా 

November 20, 2019

నిత్యం వచ్చిపోయే వారితో రద్దీగా ఉండే స్పా సెంటర్‌లో ఒక్కసారిగా ఓ భారీ కొండ చిలువ ప్రత్యక్షమైంది. సీలింగ్‌పై నుంచి ఒక్కసారిగా ఊడిపడటంతో అక్కడ ఉన్న సిబ్బంది ఉలిక్కిపడ్డారు. భయంతో అంతా పరుగులు తీశారు. ఈ ఘటన ఈనెల 12న చైనాలో జరిగింది. వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి చాకచక్యంగా దాన్నిబందించి అడవుల్లో వదిలేశారు. దీని బరువు సుమారు 20 కిలోలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. 

పదేళ్లుగా ఈ భారీ కొండ చిలువ స్పా సెంటర్‌లో తిష్టవేసినట్టు దాని యజమాని చెబుతున్నాడు. పార్లర్ నిర్మిస్తున్న సమయంలో కూలీలకు కొండ చిలువ కనిపించినట్టు తనతో చెప్పినట్టు గుర్తు చేసుకున్నాడు. అప్పట్లో దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినా తర్వాత కనిపించకుండా పోయిందని తెలిపాడు. కానీ ఇన్ని సంవత్సరాలకు సీలింగ్ పై భాగం నుంచి పార్టీషియన్ చీల్చుకొని కిందపడటంతో అది ఇన్నేళ్లు అక్కడే తిష్టవేసినట్టు తాజా ఘటనతో తేలింది. ఇంత కాలం పాటు చిన్న చిన్న కీటకాలు, ఎలుకలు తిని జీవించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దాని బరువు క్రమంగా పెరగడంతో సీలింగ్ ఊడి కింద పడిపోయిందని తెలిపారు.