QR scanning codes on medicines from April
mictv telugu

మీరు కొనే మెడిసిన్ ఒరిజినలా? డూప్లికేటా? ఇలా తెలుసుకోవచ్చు

October 3, 2022

మార్కెట్లో వివిధ వ్యాధులకు మనం రకరకాల మెడిసిన్స్ కొంటూంటాం. అయితే అన్ని రంగాల్లో ఉన్నట్టు ఇందులో కూడా నకిలీ బెడద తప్పడం లేదు. ఫలితంగా ఆరోగ్యం మెరుగుపడకపోగా, మరికొన్ని వ్యాధులకు కారణమవుతున్నాయి. థైరాయిడ్ కోసం ఎక్కువ మంది వినియోగించే ‘థైరోనార్మ్’ అనే మెడిసిన్ పేరుతో పెద్ద మొత్తంలో డూప్లికేట్ మెడిసిన్ విక్రయాలు జరుగుతున్నట్టు ఇటీవల వెలుగు చూసింది. అబాట్ కంపెనీకి చెందిన ఈ మెడిసిన్‌ నకిలీని తెలంగాణలో విక్రయిస్తున్నట్టు గుర్తించారు. దీనిపై కేసు నమోదు కాగా, అసలు మనం వాడే ఔషధాలు అసలైనవేనా? అనే అనుమానం మొదలైంది. దేశవ్యాప్తంగా ఇలాంటి పలు సంఘటనలు జరగడంతో కేంద్రం దీనికి పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేసింది. ఇక నుంచి మనం కొనే మెడిసిన్స్‌పై బార్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని ఫోన్‌తో స్కాన్ చేస్తే ఆ మెడిసిన్ ఒరిజనలా? కాదా? అనే విషయం తెలుస్తుంది. దీన్ని ట్రాక్ అండ్ ట్రేస్ అని పిలుస్తారు. తొలిదశలో ఎక్కువగా అమ్ముడుపోయే 300 రకాల ఔషధాలకు దీన్ని అమలు చేయనున్నారు. కనీసం వంద రూపాయల కంటే ఎక్కువ ఉండే ఔషధాలకు దీన్ని వర్తింపజేయనున్నారు. నిజానికి ఈ ఆలోచన పదేళ్ల క్రితమే చేశారు. కానీ, అప్పటికి ఫార్మా పరిశ్రమ దీనికి సన్నద్ధం కాకపోవడంతో ఆపేశారు. ఇప్పుడు దీని ప్రాధాన్యాన్ని గుర్తించారు. కొత్త విధానం వల్ల మూడు నుంచి నాలుగు శాతం అదనపు ఖర్చు అవుతుంది. ఈ విధానాన్ని ఏప్రిల్ నుంచి అమల్లోకి తేనుండగా, ఎగుమతి చేసే మెడిసిన్స్‌కు కూడా వర్తింపజేయాలనే ఆలోచన ఉంది.