ఓవైపు కరోనా వైరస్‌తో ప్రపంచం గజగజ వణికిపోతుంటే.. మరో పిడుగులాంటి ప్రచారం ఇప్పుడు తెరపైకి వచ్చింది. త్వరలోనే భూమి అంతం కాబోతోందంటూ సోషల్ మీడియాలో వార్త వైరల్ అయింది. ఏప్రిల్ 19వ తేదీన ప్రపంచం కనుమరుగు అవుతుందని ఈ ప్రచార సారంశం. అంతరిక్షం నుంచి వస్తున్న ఓ పెద్ద గ్రహశకలం భూమి నుంచి దూసుకెళ్తుందని, అప్పుడు యుగాంతం రాబోతోందని అంటున్నారు. ఇంతకీ దీంట్లో వాస్తవమెంత.. ఇప్పుడు ఈ ప్రచారం ఎందుకు తెరపైకి వచ్చిందని అంతా చర్చించుకుంటున్నారు.
2020 సంవత్సరంలో ఓ భారీ గ్రహ శకలం భూమికి సమీపంగా వెళ్తుందని మూడేళ్ల క్రితం నాసా ప్రకటించింది. ఆ విషయాన్ని పట్టుకొని కొంత మంది భూమి అంతం కాబోతోందని ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి 2వేల అడుగుల పరిమాణం ఉన్న జేఓ25 అనే గ్రహశకలం భూమి నుంచి 1.8 మిలియన్ కిలోమీటర్ల దూరంలో దూసుకెళ్లనుందట. ఇది చంద్రుడి నుంచి భూమికి గల మధ్య దూరానికి 4.6 రెట్లు దూరంలో పయనించనుంది. కానీ భూమిని తాకే అవకాశమే లేదని స్పష్టం చేసింది. దీని కారణంగా ఎటువంటి ప్రమాదం లేదని , వదంతులు నమ్మవద్దని సూచించింది. కావాలనుకుంటే భూమి నుంచి దూరంగా వెళ్లే క్రమంలో రాత్రివేళ టెలిస్కోపు సాయంతో ఈ గ్రహశకలాన్ని చూడవచ్చని కూడా తెలిపింది. కాగా, గడిచిన 400ఏళ్లలో కానీ, రాబోయే మరో 500 ఏళ్లలో కానీ భూమికి ఇంత సమీపంలోకి రానున్న గ్రహశకలం మరేది ఉండబోదని మాత్రం నాసా స్పష్టం చేస్తోంది.