మన దేశంలో పనిమనుషుల జీతం ఎంత ఉంటుంది? ఐదు వేలు, పదివేలు.. అంబానీ, టాటా, బిర్లాల ఇళ్లలో పనిచేసేవాళ్లకయితే ఆ యజమానుల స్టేటస్ చాలా చాలా పెద్దది కనుక రూ. 50 వేలు, పోనీ లక్ష! అంతకు మించి ఉండదు. కానీ ఓ చోట మాత్రం పనిమనిషికి నెలకు రూ. 18 లక్షల జీతం ఇస్తున్నారు. బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్ దగ్గర చేయాల్సిన ఉద్యోగం అది. అందుకే అంత జీతం.
పనీపాటాలేని బ్రిటిన్ రాజరిక కుటుంబీకుల కోసం ఏటా కోట్లకొద్దీ ఖర్చు చేస్తున్నారని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ పనిమనిషి పోస్ట్ దుమారం రేపుతోంది. విండ్సర్ క్యాజిల్‌లో హౌజ్ కీపర్ పోస్టును భర్తీ చేస్తున్నామని, అర్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని రాచకుటుంబం ప్రకటన ఇచ్చింది. తొలుత నెలకు రూ.18.5లక్షల జీతం ఉంటుందంటూ ఊరించింది. ఏడాదికి 33 సెలవులు ఉంటాయని, రాచకుటుంబ బాగోగులు చూసే ఇతర సిబ్బందికి పొందుతున్న ట్రావెలింగ్, హెల్త్, ఇన్సూరెన్స్ గట్రా అన్ని అలవెన్సులూ ఉంటాయని ప్రకటనలో తెలిపారు. అయితే ఈ పోస్టు పొందడం అంత సులభమేమీ కాదు. రాజదర్పాలను అర్థం చేసుకుని వారి అడుగులకు మడుగులు వత్తం ఎలాగా 13 నెలలపాటు ట్రైనింగ్ తీసుకోవాలి. ఇంగ్లీష్‌లో గలగలా మాట్లాడ్డంతోపాటు, లెక్కలు కూడా బాగా రావాలంట.