మునుగుతున్న నౌక.. అందులో 14,600  గొర్రెలు - MicTv.in - Telugu News
mictv telugu

మునుగుతున్న నౌక.. అందులో 14,600  గొర్రెలు

November 25, 2019

Queen Hind cargo ship carrying

14,600 గొర్రెలతో వెళ్తున్న ఓ నౌక సముద్రంలో ప్రమాదానికి గురై మునిగిపోతోంది. దీంతో దాంట్లోని గొర్రెలను, మనుషులను రక్షించడానికి రెస్క్యూ టీం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఘటన రొమేనియాలోని మిదియా రేవు వద్ద చోటు చేసుకుంది. క్వీన్ హింద్ అనే కార్గోనౌక రొమేనియా మిదియా రేవు నుంచి బయలుదేరిన కాసేపటికే.. తీరం దగ్గర్లో నల్ల సముద్రంలో మునిగిపోతోంది. అది ఒకేసారి మునిగిపోకుండా నెమ్మదిగా నీళ్లల్లో మునిగిపోసాగింది. వెంటనే అప్రమత్తమైన రొమేనియా రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టారు. వారికి సహాయంగా ఆర్మీ, పోలీసులు, డైవర్లు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. 14,600 గొర్రెలను ఎలా రక్షించాలన్నది వారికి చాలెంజ్‌గా మారింది. అప్పటికి నౌకలో 20 మంది సిరియన్ సిబ్బంది, ఓ లెబనీస్ వ్యక్తిని, 32 గొర్రెల్ని రక్షించగలిగారు. 

నౌక నెమ్మదిగా మునుగుతుండటంతో అన్నీ గొర్రెలను కాపాడతామని అంటున్నారు. ఈ ఘటనపై రొమేనియా సరుకులు, ఎగుమతులను చూసుకునే ఏస్‌బాప్ సంస్థ  ప్రెసిడెంట్ మారీపానా స్పందించారు. ‘ప్రమాదం ఎలా జరిగిందో విచారణ జరిపించాలి. దూరప్రాంతాలకు గొర్రెల్ని ఎగుమతి చెయ్యలేకపోతే… ఇక వాటిని మన దగ్గరే ఉంచుకోవడం మంచిది’ అని అన్నారు. 

మరోవైపు, అసలా నౌకకు గత డిసెంబర్‌లోనే ఇంజిన్ సమస్యలు ఉన్నాయని… అటువంటి దాంట్లో అన్ని గొర్రెలు ఎలా పంపిస్తారని NGO యానిమల్స్ ఇంటర్నేషనల్ ఆగ్రహం వ్యక్తంచేసింది. షిప్పు ఓవర్‌లోడ్ అవడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని.. వెంటనే దర్యాప్తు జరగాలని డిమాండ్ చేసింది. కాగా, రొమేనియా 2007లో EUలో చేరింది. పేద దేశంగా ఇది గుర్తింపు పొందింది. EUలో బ్రిటన్, స్పెయిన్ తర్వాత ఈ దేశంలోనే గొర్రెలు ఎక్కువ. ఇది ఎక్కువగా మధ్య ఆసియా దేశాలకు గొర్రెల్ని ఎగుమతి చేస్తుంటుంది.