తమిళనాడు సేలంలోని పెరియార్ యూనివర్సిటీ పరీక్షల్లో వచ్చిన ఓ ప్రశ్న కలకలం రేపుతోంది. సమాజంలో దిగువ కులం ఏదీ? అని అడిగి దానికింద నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. మాస్టర్ ఇన్ హిస్టరీ కోర్సు ఫస్టియర్ రెండో సెమిస్టర్లో ఈ ప్రశ్న వచ్చింది. ఈ విషయం బయటికి పొక్కడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వాతావరణం నెలకొంది. తక్షణమే ఈ ఘటనపై విచారణ చేపట్టి ప్రశ్నను రూపొందించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ వివాదంపై యూనివర్సిటీ వీసీ వివరణ ఇచ్చారు. ‘పరీక్షా ప్రశ్నలను వేరే యూనివర్సిటీకి చెందిన విద్యా నిపుణులు తయారు చేస్తారు. వివాదాస్పద ప్రశ్నపై దానిని తయారు చేసిన అధికారి వివరణ కోరాం. దానిని బట్టి ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తాం. అలాగే పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించే ఆలోచన లేదు’ అని వెల్లడించారు. మరోవైపు ప్రభుత్వం తరపున ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఉన్నతాధికారులతో విచారణకు ఆదేశించారు. కాగా, చాలా పకడ్బందీగా, ఎన్నో దశలు దాటుకొని రూపొందించే ప్రశ్నాపత్రాలలో ఇలాంటి ప్రశ్న రావడం, దానిని ఎవరూ గమనించలేకపోవడం దురదృష్టకరం.