Questions of users on 5G.. Answers
mictv telugu

5జీపై వినియోగదారుల సందేహాలు.. సమాధానాలు

October 1, 2022

ప్రధాని నరేంద్రమోదీ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో శనివారం 5జీ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. హైస్పీడ్ నెట్వర్క్ కవరేజీ అందించే ఈ 5జీపై వినియోగదారులకు అనేక సందేహాలు ఉన్నాయి. సామాన్యులకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ధరలెలా ఉంటాయి? ఎక్కువగా ఏ రంగాల్లో వాడతారు? వంటి ప్రశ్నలకు సమాధానాలిచ్చే ప్రయత్నమే ఈ కథనం.
1. అసలేంటీ 5జీ?

ఇంటర్నెట్ స్పీడుని ఎక్కువ వేగంతో అందించే టెక్నాలజీని జనరేషన్స్‌తో పిలుస్తారు. 3జీ, 4జీ, 5జీ ఆ కోవలోవే. ఒక జనరేషన్ పెరిగే కొద్దీ డేటా స్పీడ్ పెరుగుతుంది. ఇదివరకే ఉన్న 4జీ స్పీడు 600 mhz నుంచి 900 mhz మధ్య లభిస్తోంది. అయితే 5జీలో మాత్రం 24 ghz నుంచి 54 ghz మధ్యలో అందుబాటులోకి వస్తుంది. దీనికోసం టెలికాం కంపెనీలు మిడ్, హై బ్యాండ్ స్పెక్ట్రమ్ ఉపయోగిస్తారు.

2. 4జీ, 5జీ మధ్య తేడాలేంటి?

స్పీడ్ పరంగా చూస్తే 4జీ కన్నా పది రెట్ల వేగంతో పని చేస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే హైక్వాలిటీ ఉన్న సినిమా కొన్ని క్షణాల్లో డౌన్‌లోడ్ అవుతుంది. 4జీ గరిష్టంగా 150 ఎంబీపీఎస్‌తో లభిస్తే 5జీ 10 జీబీపీఎస్ స్పీడ్ ఉంటుంది. సినిమాలతో పాటు అనేక డివైజ్‌లకు కనెక్ట్ అవుతుంది.

3. ఖరీదు ఎక్కువగా ఉంటుందా?

దీని గురించి సమాచారం పెద్దగా లేదు. అయితే 4జీ కంటే 5జీ కొంచెం ఎక్కువగా ఉండబోతోంది. కానీ, సగటు భారతీయ వినియోగదారులు ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జియో ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రధాని మోదీ చెప్పినట్టు మన దేశంలో డేటా చౌకగా లభిస్తుంది కాబట్టి కస్టమర్లపై భారం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండదని తెలుస్తోంది.

4. ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?

ప్రస్తుతానికి దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లోనే ప్రారంభమైంది. డిసెంబర్ 2023 వరకు దేశంలోని అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి వస్తుందని జియో తెలిపింది. ఎయిర్ టెల్ కూడా అందుకు ధీటుగానే తగిన ఏర్పాట్లు చేస్తోంది. మార్చి 2024 కల్లా ప్రతీ మూలకు 5జీ కనెక్షన్ ఇస్తామని చెప్తోంది. అంతేకాక, జియో కంటే ఎయిర్ టెల్ కాస్త ముందుగానే వివిధ నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించబోతోంది.

5. 5జీకి ప్రత్యేక టవర్లు ఉండాలా?

ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ వంటి రంగాలు ఎక్కువగా వినియోగించే చోట చిన్న డబ్బాల్లాంటి టవర్లను ఏర్పాటు చేస్తారు. అవి లేని చోట ఇప్పుడున్న టవర్ల ద్వారానే 5జీ సేవలు అందిస్తారు. ఇది రేడియో ఫ్రీక్వెన్సీపై ఆధారపడి ఉంటుంది.

6. 4జీ స్మార్ట్‌ఫోన్లు సపోర్ట్ చేస్తాయా?

ఖచ్చితంగా చేయవు. 5జీ కోసం కొత్తగా ఆ సదుపాయం అందించే ఫోన్లను కొనుగోలు చేయాల్సిందే. పండుగ సీజన్ సందర్భంగా అనేక మొబైల్ తయారీ కంపెనీలు కొన్ని 5జీ మోడళ్లను మార్కెట్లో ప్రవేశపెట్టాయి. మధ్యతరగతి అభిరుచులకు అనుగుణంగా తక్కువ ధరకే ఆఫర్ చేస్తున్నాయి.
ఇప్పుడు ప్రారంభం మాత్రమే కావడం వల్ల విస్తృతమైన సమాచారం ఇంకా అందుబాటులోకి రాలేదు. కానీ, 5జీ వల్ల సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు ఖాయమంటున్నారు నిపుణులు. కాలక్రమేణా టీచరు, డాక్టరు, డ్రైవరు వంటి ఉద్యోగాలు తగ్గిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు.