Home > Featured > డ్రింక్ కోసం కాదు, డ్రింకింగ్ వాటర్ కోసం..

డ్రింక్ కోసం కాదు, డ్రింకింగ్ వాటర్ కోసం..

Queue for drinking water in delhi .jp

ఇద్దరిదీ దప్పికే. ఒకరికి ప్రాణాలు నిలుపుకోడానికి. మరొకరిది ప్రాణాలను మత్తుగా ఊరుకోబెట్టడానికి. సూటిగా విషయంలోకి వస్తే.. మనదేశంలో మంచినీరు దొరకని ప్రాంతాలు లక్షలు ఉన్నాయని, మందు దొరకని ప్రాంతాలు లేనేలేవని నేటి భారతం దృశ్యాలు కళ్లకు కడుతున్నాయి. లాక్‌డౌన్ నుంచి మద్యం అమ్మకాలకు మినహాయింపు ఇవ్వడంతో దేశవ్యాప్తంగా వైన్ షాపుల ముందు చేంతాండత క్యూలు కనిపిస్తున్నాయి.

కష్టార్జితంతోపాటు పింఛన్ డబ్బులను కూడా ‘ఇస్తినవమ్మా వాయనం.. పుచ్చుకోవమ్మా వాయనం’ టైపులో మద్యం ప్రియులు తిరిగి ప్రభుత్వ ఎదాన కొడుతున్నారు. మరోపక్క.. గొంతు తడుపుకోడానికి గుక్కెడు నీళ్ల కోసం సామాన్య ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. అసలే వేసవి కావడంతో మహానగరాల నుంచి పల్లెల వరకు మంచినీటికి కొరత ఏర్పడింది. ఆ సమస్యను పట్టించుకోని ప్రభుత్వాలు ఆదాయం కోసం ప్రజల ప్రాణాలను లెక్కచేయకుండా షాపులను బార్లా తెరచేశాయి.

దేశరాజధాని ఢిల్లీలోని చిల్లా ప్రాంతంలో మంచినీటికి కటకటగా ఉంది. జల్ బోర్డు ట్యాంకర్లు తిప్పుతున్నా ఒక్కొక్కరికి బిందె వస్తే గగనం. దీంతో ట్యాంకర్ రావడానికి గంటల ముందే జనం ఇలా క్యూలలో నిలబడుతున్నారు. ఎండలో చెమటలు చిందిస్తూ తమ వంతు వస్తే పట్టుకుని పోయి వంట చేసుకుందామని ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోపక్క అదే ఢిల్లీలో మందు కోసం వేలమంది కిలోమీటర్ల దూరం నిలబడిన సీన్లు కూడా కోకొల్లలుగా కనిపిస్తున్నాయి.

Updated : 6 May 2020 2:32 AM GMT
Tags:    
Next Story
Share it
Top