మీ గుండెచప్పుడే బాంబుపేలుడు..  ప్రపంచంలోనే అత్యంత నిశ్శబ్ద గది  - MicTv.in - Telugu News
mictv telugu

మీ గుండెచప్పుడే బాంబుపేలుడు..  ప్రపంచంలోనే అత్యంత నిశ్శబ్ద గది 

December 11, 2020

nhnghn

హర్రర్ సినిమాల్లో నిశ్శబ్దాన్ని భయంకరంగా చూపిస్తారు. కిటికీలోంచి సైలెంట్‌గా ఓ దెయ్యం చెయ్యి దూసుకొచ్చి హీరోయిన్ భుజమ్మీద పడుతుంది. తర్వాత కర్ణకఠోర శబ్దాలు వినిపిస్తాయి. ఏ హర్రర్ సినిమా చూసినా ఇలాంటి సీన్ ఒకటైనా ఉంటుంది. నిశ్శబ్దం అంత భయంకరంగా ఉంటుంది మరి. 

నిశ్శబ్దంలోనూ చాలా రకాలు ఉన్నాయి. బయటి రణగొణ ధ్వనులు వినిపించకుండా సౌండ్ ప్రూఫ్ గదులు నిర్మించుకుంటారు కొందరు. ఆడియో రికార్డింగ్, వీడియో షూటింగ్ కోసం కూడా సౌండ్ ప్రూఫ్ థియేటర్లను వాడుతుంటాయి. సూది కిందపడ్డా, చీమ చిటుక్కుమన్నా వినిపిస్తుంది ఆ ప్రాంతాల్లో. 

మన గుండెచప్పుడే మనకు బాంబు పేలుడులా భీకరంగా వినిపించే ప్రదేశం కూడా ఉంది. అమెరికాలోని మినియాపొలిస్‌లోని ఉందీ థియేటర్. దీని పేరు ఓర్ఫీల్డ్ ల్యాబొరేటరీస్. ప్రపంచంలోనే అత్యంత నిశ్శబ్ద ప్రదేశం ఇది. అక్కడ శబ్దస్థాయి మైనస్ 9.4 డెసిబుల్స్. లోపలికి అడుగుపెడితే మన గుండె చప్పుడు, శ్వాస, కడుపులో గడబిడ, నరాల స్పందన మనకు భీకరంగా వినిపిస్తాయి. ఎందుకొచ్చారం రా దేవుడా అని బయటికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాం. ఒక మాటలో చెప్పాలంటే అదొక నిశ్శబ్ద నరకం. ఆడియో కంపెనీలు తయారుచేసే పరికరాల నాణ్యతను ఇందులో పరీక్షిస్తారు. అంతరిక్షంలో వెళ్లే వ్యోమగాములు కూడా ఇందులో శిక్షణ పొందుతారట. అంతరిక్షంలోని నిశ్శబ్దానికి అలవాటు పడటానికి ఇందులో వారికి శిక్షణ ఇస్తారు.